Manik Rao Thackeray fires on CM KCR : తెలంగాణ సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొప్పలు గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడానికి అక్కడి మీడియాకు వందల కోట్ల రూపాయల ప్రజల సంపదను ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా చందన పల్లి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీబీఐ, ఈడీ, ఐటీ పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలు, అవినీతి జరిగాయని పలుమార్లు మాట్లాడిన మోదీ, అమిత్‌షాలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికి కారణం బీజేపీ, బీఆర్ఎస్లు రహస్య స్నేహితులు కావడమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సంపదను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
- Bhatti Vikramarka on KCR : 'బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే'
- Bandi Sanjay Fires on CM KCR : 'కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది సీఎం కేసీఆరే'
ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి వెనక్కి గుంజుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటిని ప్రభుత్వ పెద్దలకు కట్టబెడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ఉపయోగ పడుతోందని ఎద్దేవా చేశారు. చిన్న, సన్నకారు రైతులకు కలిగే ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెవెన్యూ సంపద అందరికీ పంచాలి కానీ.. కొంతమంది సంపన్నులకే దక్కుతున్నదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలను, ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
తెలంగాణ భవిష్యత్తు కోసం కేసీఆర్ తెచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏవని ప్రశ్నించారు. కొత్త విద్యాసంస్థలు, పవర్ ప్రాజెక్టులు ప్రారంభించలేదని దుయ్యబట్టారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని.. తాగునీటి కోసం గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పాలన, చేరికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. రాష్ట్ర అభివృద్ధిని మరచిపోయారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల ఇంఛార్జీగా డీకే శివకుమార్ వస్తారనేది అవాస్తవమని మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు..: ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఇతర రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు వచ్చినట్లే శివకుమార్ కూడా వస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకోవడానికి నూటికి నూరు శాతం ప్రజలు సిద్ధమయ్యారనీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని వారిని పార్టీలోకి చేర్చుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ బలోపేతానికి సహకరిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: