సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం సద్దుమణగక ముందే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారని, టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మాణికం ఠాగూర్ స్పందించారు. టీ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకున్నది నిజమేనని స్పష్టం చేశారు. కానీ, వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అయ్యారనేది మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రేను ఏఐసీసీ నియమించింది. మాణికం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై మాణికం ఠాగూర్ గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న విభేదాలను ఆయన పరిష్కరించలేకపోయారు. వివాదం మరింత జఠిలం కావడానికి మాణికం ఠాగూర్ కూడా కారణమని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. వివాదం మొదలైనప్పుడు వెంటనే ఆయన స్పందించలేదు, పీసీసీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనేది సీనియర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయే క్రమంలో ఏఐసీసీ జోక్యం చేసుకుంది. పీసీసీ, సీనియర్లకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర నాయకులతో విడివిడిగా మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీకి నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో గత వారం.. పదిరోజులుగా మాణికం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి వైదొలుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిలు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు రాజీనామా లేఖలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా మాణికం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బదిలీ చేశారు. ఆ స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను ఇంఛార్జ్‌గా నియమించారు.
ఇవీ చూడండి: