Alliance War In Telangana Politics : రాష్ట్ర రాజకీయ రణక్షేత్రంలో పైచేయి సాధించాలనే లక్ష్యంతో పార్టీలు మాటల తూటలకు మరింత పదునుపెడుతున్నాయి. ఇప్పటికే వివిధ అంశాల వేదికగా రాజకీయ వేడి రాజుకోగా.. ఇప్పుడు పార్టీల కుమ్మక్కు రాజకీయ విమర్శలు.. దీనిని పతాకస్థాయికి చేర్చాయి. బీఆర్‌ఎస్, బీజేపీ కలసి సాగుతున్నాయన్న విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందిచారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు ఇటీవల జరిగిన అనేక ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. దిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు.
"కాంగ్రెస్ ఎన్ని ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కైంది. ఆఖరికి మేఘాలయలో కలసి గవర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కైయ్యాయి. జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు ఉన్న దగ్గర కాంగ్రెస్‌కు ఓట్లు రాలేదా? ఒకవైపు ఆర్డినెన్స్‌కు బీజేపీకు అనుకూలంగా ఓటేస్తారు.. కాంగ్రెస్‌నే బీ టీం." - కేటీఆర్, మంత్రి
Telangana Assembly Elections 2023 : మరో అడుగు ముందడుగు వేసిన కాంగ్రెస్... కేటీఆర్ దిల్లీ పర్యటనను అస్త్రంగాచేసుకుని ఆరోపణలు గుప్పించింది. బీఆర్‌ఎస్ నేతలు దిల్లీలో అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారని... ఈ భేటీ ప్రధాన లక్ష్యం బీజేపీ-బీఆర్‌ఎస్ పొత్తును ఖరారు చేసుకోవడమేనని విమర్శించారు.
"కేటీఆర్ ఏం చెబుతున్నప్పటికీ.. బహిరంగంగా ఏం జరుగుతుందనే విషయం అందరికీ కనిపిస్తోంది. పరుగు పరుగున వచ్చి దిల్లీలో అమిత్‌షాను కలుస్తున్నారు. ఎలాంటి పనిలేకపోయినా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఇప్పటికే కలిసి సాగుతున్న రాజకీయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపైనే మంత్రులతో చర్చిస్తున్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆ పార్టీతో కలిసి సాగాలని నిర్ణయించారు. నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు." - మాణిక్‌రావుఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్‌ఛార్జి
"కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎప్పటికీ ఒక్కటే. కేంద్రమంత్రులు, నేతల్ని కలవడంలో ఎలాంటి రాజకీయాలు ఉండవు. అభివృద్ధి ఎవరినైనా కలవవచ్చు. ఇప్పుడు ఈ విషయంపై చర్చ అనవసరం. మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు." -బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Bandi Sanjay Comments On Congress And BJP : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఇప్పటికే పలుమార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రమంత్రులు నేతల్ని కలవడంలో ఎలాంటి రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో ఎవరినైనా కలుస్తారని సంజయ్ తెలిపారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే పొత్తులు, ఎత్తుల రాజకీయం కాక రేపుతుండగా.. రానున్నరోజుల్లో మరింత రసవత్తరంగా మారనుంది.
ఇవీ చదవండి :