అమెరికా వెళ్లేందుకు వీసా ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంబీఏ పూర్తి చేసిన నరేందర్ పలు కన్సల్టెన్సీ కంపెనీలలో పని చేశాడు. అనంతరం 2018లో సొంతంగా కన్సల్టెన్సీ ప్రారంభించి అమెరికాకు వీసా ఇప్పిస్తానంటూ ప్రకటనలు ఇచ్చాడు. అమెరికా వెళ్లే ఆశావహులు నరేందర్‌ను సంప్రదిస్తే వీసాకు కావలసిన ధ్రువ పత్రాలన్నింటిని తీసుకునేవాడు. వీసా ప్రాసెసింగ్ చేసేందుకు డబ్బులు తీసుకునే వాడు.
ఇలా అమీర్‌పేట్‌కు చెందిన సంతోష్ నుంచి వీసా కోసం 5.50 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఫోన్లోనూ మెయిల్‌లోనూ స్పందించకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు నరేందర్‌ను అరెస్ట్ చేసి అతని చరవాణి, బ్యాంకు ఖాతాకు సంబంధించిన పాస్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. అతను ఎంత మందిని మోసం చేశాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్‌పై సీబీఐలో కేసు నమోదు