ఒకే వ్యక్తికి డెంగీ, కొవిడ్.. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కోసం వెళ్తే.. అక్కడున్న సిబ్బంది అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. ఫలితంగా కొవిడ్‌తో పాటు డెంగీ జ్వరం సోకిన ఐదు కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వారికి జాగ్రత్తగా చికిత్స అందించామని వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో డెంగీ, మలేరియాకు సంబంధించి నమూనాలు తీసుకుని పరీక్ష కేంద్రాలకు పంపిస్తారు. పౌరులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తగ్గిన డెంగీ, మలేరియా కేసులు
హైదరాబాద్ మహానగరంలో గతయేడాదితో పోలిస్తే డెంగీ, మలేరియా జ్వరం కేసులు తగ్గాయి. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం, దోమల నివారణ చర్యలపై జనాన్ని చైతన్యం చేసేందుకు సర్కారు చేపట్టిన ‘ప్రతి ఆదివారం.. పది నిమిషాలు’, ఇతరత్రా అవగాహన కార్యక్రమాలు అందుకు దోహదపడ్డాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పౌరులు ప్రాధాన్యమివ్వడంతో మొత్తంగా దోమకాటు సమస్య తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మరింత అప్రమత్తంగా ఉంటామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.
జోన్ | జోన్లలో దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల సంఖ్య |
ఎల్బీనగర్ | 15 |
చార్మినార్ | 35 |
ఖైరతాబాద్ | 30 |
సికింద్రాబాద్ | 43 |
శేరిలింగంపల్లి | 36 |
కూకట్పల్లి | 25 |
అవగాహన పెరిగింది..
నగరంలో గతేడాది రికార్డుస్థాయిలో 3,366 డెంగీ కేసులు నమోదయ్యాయి. అందులో 1,406 పాజిటివ్ కేసులు కాగా.. అనుమానిత కేసులు 1960. ముఖ్యంగా గత సెప్టెంబరులో వ్యాధి తీవ్రత పతాకస్థాయికి చేరింది. ఏడాదంతా నమోదైన కేసుల్లో సగం ఆ నెలలోనివే. ఈసారి డెంగీ వ్యాప్తి తగ్గింది. జీహెచ్‌ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు డాక్టర్ రాంబాబు అందుకు పలు కారణాలను తెలిపారు. ‘‘దోమకాటు వల్ల డెంగీ, మలేరియా వస్తాయి. జనావాసాల్లో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు యంత్రాంగం రోజూ శ్రమిస్తోంది. వేలాది కార్మికులు చెరువులు, కుంటలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో మందు పిచికారి చేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉండే చెరువుల్లో చల్లేందుకు ప్రస్తుతం 11 డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. గతంకంటే రెట్టింపు మొత్తంలో ఫాగింగ్ యంత్రాలను తెచ్చాం. ఇవి వీధుల్లో దోమల వ్యాప్తిని అరికడుతున్నాయి. అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. చాలా మంది పరిశుభ్రతపై దృష్టిసారించారు. అలాంటివారిని మరింతగా ప్రోత్సహిస్తూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం పది నిమిషాలపాటు గృహస్తులంతా ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు నెలలపాటు కాలనీలు, బస్తీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఫలితంగా దోమల ఉత్పత్తి నియంత్రణలోకి వచ్చింది. కేసులు తక్కువయ్యాయి.’’అని ‘ఈనాడు’కు తెలిపారు.
డెంగీ కేసుల తగ్గుదల పరిశీలిస్తే..
2019 | 2020 | |
మార్చి | 11 | 13 |
ఏప్రిల్ | 3 | 1 |
మే | 13 | 5 |
జూన్ | 23 | 13 |
జులై | 81 | 18 |
ఆగస్టు | 69 | 28 |
ఇవీ చూడండి: ఆటలు సాగవిక: కొత్త రెవెన్యూ చట్టానికి సర్కారు కసరత్తు