Mahila Congress Rally: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ శక్తియాత్ర చేపట్టి 125 రోజులు పూర్తయిన సందర్భంగా.. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్ వద్ద మహిళలు ర్యాలీ చేపట్టారు. గాంధీభవన్ నుంచి మొదలైన ర్యాలీ నాంపల్లి స్టేషన్ కూడలి, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం మీదుగా తిరిగి గాంధీభవన్ చేరుకుంది. మహిళా కాంగ్రెస్ ర్యాలీని నిలువరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని అనుమతించాలని పట్టుబట్టడంతో.. రోప్ వే ఏర్పాటు చేసి ర్యాలీకి పోలీసులు అనుమతించారు.
మహిళలకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్ రెడ్డి
అంతకుముందు ఇందిరా భవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో 'మై లడ్కీ హూ.. లడ్ సక్తా హూ' కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ప్రియాంక గాంధీ చేపట్టిన శక్తి యాత్రలో భాగంగా మహిళా కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. మహిళలను సమీకరించి పోరాటం చేయడం సంతోషకరమైన విషయమని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, పార్టీ అగ్ర నాయకులు అంతా మహిళలేనని రేవంత్ పేర్కొన్నారు. ప్రతిభా పాటిల్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు.
4 మంత్రి పదవులు ఇస్తాం
మహిళల ద్వారానే తెలంగాణ సాకారం అయిందన్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ వైఖరితో ఎక్కువ నష్టపోయింది వారేనని ఆరోపించారు. తొలి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. రెండో దఫా కాంగ్రెస్ పోరాటంతో ఇద్దరికి పదవులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని రేవంత్ వెల్లడించారు.
ఇదీ చదవండి: CM KCR National Politics: 'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'