రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందేలా చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఒక సభ్యుడిగా ఉంటూ.. అందరి ఆదరాభిమానాలు చురగొనడానికి ప్రతిక్షణం పనిచేశానని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయని చెప్పారు. కానీ ఆ సమయంలో సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు దిశా నిర్దేశం చేసి.. శాంతి భద్రతలకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు.
అత్యవసర సేవలకు డయల్ 100ను అనుసంధానం చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హోం గార్డుల వేతనాలు పెంచామని గుర్తు చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్ అవసరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందేలా ఎన్నో చర్యలు చేపట్టమాని పేర్కొన్నారు. ఈ ఫలితాల కోసం ప్రతి పోలీసు ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు.
పోలీస్ స్టేషన్ ఓ దేవాలయంగా నిలిచి పోతుందని మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలు, వివిధ కాలనీల సంఘాలు, కార్పొరేటర్ల సహకారంతో .. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే మహేందర్‌రెడ్డి కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. పోలీస్ విధుల్లో భాగంగా తన భార్య, పిల్లలను కొన్ని సార్లు నిర్లక్ష్యానికి గురి చేశానని తెలిపారు. అయినా వారు తనకు ఎంతో సహకరించారని పేర్కొన్నారు.
36 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు సహకరించిన అందరికీ మహేందర్‌రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్న అంజనీకుమార్ అభినందనలు తెలిపారు. ప్రతిభ కలిగిన అంజనీ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర పోలీస్ మరింత ముందుకు దూసుకు వెళ్తుందని ఆయన ఆకాంక్షించారు
మహేందర్‌రెడ్డితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న అంజనీకుమార్ అన్నారు. ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని కొనియాడారు. ఎన్నో రకాలుగా తనకు ఆదర్శమని పేర్కొన్నారు. కేసీఆర్ ముందు చూపు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అంజనీకుమార్ వెల్లడించారు.
ఇవీ చదవండి: వైద్యఆరోగ్య శాఖలో కొలువుల జాతర.. 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ
రూ.49తో 'డ్రీమ్11'లో బెట్టింగ్.. DJ వర్కర్‌కు రూ.కోటి జాక్‌పాట్..