Mahbubnagar District Latest Politics 2023 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
''కాంగ్రెస్ పార్టీ.. సీనియర్ నాయకులకు టికెట్లు కేటాయించకుండా అప్పుడే పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తోంది. కాంగ్రెస్‌లో ఉంటే గుర్తింపు ఉండదని మా కార్యకర్తలు అంటున్నారు. వారి అభీష్టం మేరకు నేను బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను.'' - నాగం జనార్దన్‌రెడ్డి
Nagam Janardhan Reddy Joins BRS : నాగర్ కర్నూల్‌లో తనకు కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టిక్కెట్టు కేటాయించడాన్ని నిరసిస్తూ నాగం జనార్దన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఇతర పార్టీల్లో చేరే విషయంలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు నాగం ఇంటికి చేరుకుని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
'' సీనియర్ నాయకులు నాగం జనార్దన్‌రెడ్డికి బీఆర్ఎస్లో చేరినందుకు పార్టీ గౌరవించి ఆహ్వానించింది. మా ముఖ్యమంత్రి ఆయనకు పార్టీలో సముచిత స్థాయిని కల్పిస్తారు. ఆయన వెంట వచ్చిన నాయకులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అందర్నీ కలుపుకొని మేం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం.'' - కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
Erra Sekhar Joined in BRS : జడ్చర్లలో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎర్రశేఖర్.. హస్తం పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శనివారం కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా బరిలో ఉంటానని ప్రకటించిన ఎర్రశేఖర్.. ఆదివారం ఉదయం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ సైతం బీఆర్ఎస్లో చేరారు. బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపునకు కృషి చేస్తానని వెల్లడించారు.
Mahbubnagar Leaders Changing Parties 2023 : నాయకుల పార్టీ మార్పులు ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న కొంతమంది నేతలు..కాంగ్రెస్ బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. వనపర్తిలో బీఆర్ఎస్ అసంతృప్త నాయకుడొకరు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ 14 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించగా.. బీజేపీ 3స్థానాలకు మాత్రమే ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లోని అసంతృప్త నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
నామినేషన్ల పర్వం తుదిఘట్టానికి చేరుకునే వరకూ, కీలక నేతల వలసల పర్వం కొనసాగే అవకాశం ఉంది. అంతకు ముందు కూడా జిల్లాలో భారీగా వలసలు కొనసాగాయి. యెన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు, గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ఇటీవల వలస వచ్చిన నాయకులే కావడం గమనార్హం.
BRS Election Campaign in Full Josh : ఇంటింటి ప్రచారంతో నేతలు.. గెలుపు వేటలో గులాబీ పరుగులు