వైద్య పరికరాలు, వైద్యులు సరిపడా లేకున్నప్పటికీ.. భారత్ ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో వైద్య బృందంతో సమష్టి కృషి చేసి.. కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించామని పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద నూతనంగా ఆధునికీకరించిన మహావీర్ ఆసుపత్రిని మంత్రి ఈటల ప్రారంభించారు.
కరోనాను తట్టుకొన్న చైనా.. దాన్ని అదుపులోకి తీసుకువచ్చిందని ఈటల అన్నారు. ప్రకృతి విపత్తులను అదుపులో చేశామని మాట్లాడిన అమెరికా, యూరోపియన్ దేశాలు అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. కరోనాను అదుపులోకి తీసుకురాలేక అల్లాడుతున్నాయని పేర్కొన్నారు. 135కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా వల్ల ఏమవుతుందోనన్న భయాందోళనలు ఏర్పడినప్పటికీ.. మన ధైర్యసాహసాలే మనల్ని కాపాడాయన్నారు.
ఫిబ్రవరిలో హైదరాబాద్ ప్రజలు కరోనా భయంతో బెంబేలెత్తిపోయారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వేదనకు గురైందన్నారు. ప్రస్తుతానికి ఆ స్థాయిని అధిగమించామని ఈటల స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న మహావీర్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: దేశంలో 3.6 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు