మహారాష్ట్రలో గోదావరిపై అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు (Babli project) తెరుచుకున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం నేడు గేట్లు తెరిచారు. ప్రస్తుతం గోదావరికి 4300 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తోంది. బాబ్లీ గేట్లు ఎత్తి అందులోని కొద్దిపాటి నీరు దిగువకు వదులుతున్నారు.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు పైభాగంగా కురుస్తున్న వర్షాలతో విష్ణుపురి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు ఒక గేటును తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. ఆ ప్రవాహం బాబ్లీకి చేరి దిగువకు వస్తోంది. ఈ జలాలతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఉమ్మడి రాష్ట్రాల ఇరిగేషన్, జల అధికారుల నేతృత్వంలో బాబ్లీ గేట్లు ఎత్తారు.
నదీ జలాలు దిగువకు వదులుతున్నందున తీర ప్రాంతాల రైతులు, మత్య్సకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏటా జులై 1 నుంచి అక్టోబరు 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని వదులుతారు. ఈ జలాలతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరందుతుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఏటా ఏవిధంగా నీళ్లను దిగువకు విడుదల చేస్తారో అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టు అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశాము. డ్యాం 14 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నాము. గేట్లు తెరిచే ముందు జలాశయంలో 0.94 టీఎంసీల నీరు ఉంది. -ఎన్. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ
ఇదీ చూడండి: Bandi Sanjay: దేశంలో అలాంటి ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్ మాత్రమే..!