madhu yaski Comments on KCR: రాహుల్ గాంధీ నాయకత్వంపై భాజపా కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తోందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్‌లో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాజపా గెలవడానికి కేసీఆర్ దోహదపడ్డారని మధుయాష్కీ మండిపడ్డారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే సర్జికల్ స్ట్రైక్ గురించి కావాలనే సీఎం మాట్లాడారని అన్నారు. ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఆర్మీ, మాజీ సైనికులు ఉంటారని... సెంటిమెంట్ రగిలించడం ద్వారా అక్కడ భాజపాను గెలిపించారని మధుయాష్కీ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి చప్పుడు చేయకుండా ఉండిపోయారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అసదుద్దీన్ ఓవైసీల సహకారంతో భాజపా గెలుపొందిందని పేర్కొన్నారు.
"1998 నుంచి సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్నారు. 2004లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనూ అనేక రాష్ట్రాలలో విజయం సాధించాం. సోనియాగాంధీ నాయకత్వాన్నిబలపరుస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ పోరాట పటిమకు తెలంగాణ కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహ పడొద్దు. తిరిగి కోలుకుంటుంది. రాష్ట్రాల వారీగా సమీక్షలు చేసుకుని పార్టీ ముందుకు వెళ్లుతుంది." -మధుయాష్కీ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్
ఇదీ చదవండి: కేసీఆర్ ఆరోగ్యంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: రాజగోపాల్ రెడ్డి