Madhapur Drugs Case Updates : హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో దొరికిన మత్తుపదార్థాల తీగ లాగితే.. మాదాపూర్ విఠల్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్‌పార్టీ డొంక కదిలింది. అందులో పట్టుబడిన వైజాగ్‌కు చెందిన రాంచందర్ ద్వారా మత్తు పదార్థాలను.. నవదీప్ కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుల జాబితాలో చేర్చారు.
Hyderabad Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ కేసు ఆధారంగా విచారించగా తొలుత తనకేం తెలియదని బుకాయించేందుకు ప్రయత్నించినా.. పోలీసులు అతడి ఫోన్‌కాల్ డేటా, డ్రగ్స్ నిందితులతో జరిపిన సంప్రదింపులు, పబ్బుల్లో ఏర్పాటు చేసిన పార్టీల వివరాలు ఎదుట ఉంచటంతో దారికొచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారిస్తే బెంగళూరు, దిల్లీ, ముంబయికి చెందిన డ్రగ్స్ విక్రయించే వారితో పరిచయాలు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
Tollywood Drugs Case Updates : పాన్‌ఇండియా తరహాలో టీఎస్‌న్యాబ్ డ్రగ్స్‌పై లోతుగా దర్యాప్తు చేస్తోందని నటుడు నవదీప్ అన్నారు. మత్తుపదార్థాల కేసులో పారిపోయానంటూ మాధ్యమాల ద్వారా వచ్చినవి వదంతులు మాత్రమేనని సృష్టం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చినట్లు తెలిపారు. కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. నోటీసులిస్తే వచ్చానని వివరించారు. గతంలో పబ్ నిర్వహించినపుడు సిట్, ఈడీ దర్యాప్తునకు హాజరయ్యానని.. అప్పుడు ఇచ్చిన జవాబులే ఇప్పుడు నార్కోటిక్ పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
"పాన్‌ఇండియా తరహాలో టీఎస్‌న్యాబ్.. డ్రగ్స్‌పై లోతుగా దర్యాప్తు చేస్తోంది. మత్తు పదార్థాల కేసులో పారిపోయానంటూ మాధ్యమాల ద్వారా వచ్చినవి వదంతులు మాత్రమే. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను. ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నోటీసులిస్తే వచ్చాను. గతంలో పబ్ నిర్వహించినపుడు.. సిట్, ఈడీ దర్యాప్తునకు హాజరయ్యాను. అప్పుడు ఇచ్చిన జవాబులే ఇప్పుడు నార్కోటిక్ పోలీసులకు ఇచ్చాను. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాను". - నవదీప్, యాక్టర్
మాదాపూర్ డ్రగ్స్‌కేసులో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించినట్లు టీఎస్‌న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. కేసులో 81 లింకులను గుర్తించామని, వాటిలో నవదీప్ 41 లింకుల వివరాలు అందించినట్లు వెల్లడించారు. సిట్, ఈడీ విచారణ ఎదుట డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఫోన్లలోని డేటాను నవదీప్ పూర్తిగా తొలగించారని.. ఆ సమాచారం తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తామని సునీతారెడ్డి వివరించారు.
"మాదాపూర్ డ్రగ్స్‌కేసులో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించాం. ఈ కేసులో 81 లింకులను గుర్తించాము. వాటిలో నవదీప్ 41 లింకుల వివరాలు అందిచాడు. సిట్, ఈడీ విచారణ ఎదుట డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఫోన్లలోని డేటాను నవదీప్ పూర్తిగా తొలగించాడు. ఆ సమాచారం తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తాం". - సునీతారెడ్డి, నార్కోటిక్ బ్యూరో ఎస్పీ