తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వల్ల ప్రతి ఒక్కరిలో ప్రతికూల ఆలోచనలు వేధిస్తున్నాయి. వీరిలో అధికశాతం ఒంటరితనం, భయం, మానసిక ఆందోళనతో సతమతమవుతున్నట్టు సికింద్రాబాద్ సింధీ కాలనీలోని రోష్ని స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఆ సంస్థ ప్రతినిధులు మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేసేందుకు సహకారం అందిస్తున్నారు. ఫోన్‌కాల్ ద్వారా బాధితులకు ఓదార్పును అందిస్తూ జీవితంపై సానుకూల దృక్పథం అలవరిచేందుకు కృషి చేస్తుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్‌కాల్స్ స్వీకరిస్తూ మానసిక నిపుణుల సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి వైద్యుల సూచనతో ఉచితంగా మందులను ఇంటివద్దకు చేరవేస్తున్నారు. మూడు వారాలుగా రోష్ని స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌లైన్‌కు రోజూ 65-70 వరకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. వీటిలో 10-15 వరకు వైరస్‌కు సంబంధించిన అనుమానాలు ఉంటున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఉషశ్రీ తిపిర్నేని తెలిపారు.
అభద్రతా భావం.. అగమ్యగోచరం
కొవిడ్-19 సోకితే బయటపడగలమా? లేదా? ఆనే ఆలోచనలు.. స్నేహితులతో గడిపి ప్రస్తుతం ఒంటరి అయ్యామనే భావన యువతలో కనిపిస్తోంది. పొగతాగటం, మద్యపానం, మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారు కొద్దిరోజులుగా వాటికి దూరమై వింతగా ప్రవర్తిస్తున్నారు. 5-6శాతం మంది ఉద్యోగులు కరోనా ప్రభావంతో కొలువులు పోతే కుటుంబం పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన పడుతున్నారని ఉషశ్రీ వివరించారు.
మనసుకు ఊరట.. అన్నార్తులకు బాసట
పరిస్థితుల ఆధారంగా మనిషిలోని భావోద్వేగాలు మారుతుంటాయి. ప్రతికూల ఆలోచనలు ముసురుకునే సమయంలో ఓదార్పునిస్తే వారు ధైర్యంగా ఉంటారు. రోష్ని హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫోన్‌కాల్స్ ద్వారా మానసిక తోడ్పాటును అందిస్తున్నామని ఆ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఉషశ్రీ తిపిర్నేని వివరించారు. సమస్య ఏదైనా తాత్కాలికమే అని గుర్తించాలి. మనసు కలత చెందినపుడు మాకు ఫోన్ చేస్తే తగిన సహకారం అందిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం