Domalguda LPG Fire Accident Update : సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని శ్రీనివాసనగర్‌లో లాలాజీ శ్యామ్ కుటుంబం నివాసం ఉంటోంది. తొమ్మిదేళ్ల క్రితం దోమలగూడకు చెందిన పద్మ కుమార్తె ధనలక్ష్మితో లాలాజీకి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లులు ఉన్నారు. అభినవ్, శరణ్యశ్రీ, విహాన్. ఏటా ధనలక్ష్మి కుటుంబం.. బోనాల పండగకు తల్లి పద్మ ఇంటికి వెళ్తారు. ఈసారి కూడా తల్లిగారింటికి పిల్లలతో సహా ధనలక్ష్మి వచ్చింది. ఎల్బీనగర్‌లో ఉండే పద్మ సోదరి నాగమణి, ఆమె భర్త ఆనంద్ పండుగకు దోమలగూడ వచ్చారు.
LPG Fire Tragedy in Domalguda : ఈనెల 11న ఉదయం అల్పాహారం కోసం పూరీలు చేద్దామని గ్యాస్ వెలిగించారు. వంట చేసే సమీపంలోనే ధనలక్ష్మి ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆనంద్, నాగమణి కూడా అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. క్షణాల్లోనే మంటలు ఎగసి పడటంతోపాటు సలసలా కాగే నూనె అక్కడున్న అందరిపైనా చిమ్మింది. కాలిన గాయాలతో హాహాకారాలు చేస్తున్నవారిని స్థానికులు పోలీసుల సాయంతో గాంధీ అసుపత్రికి తరలించారు.
Death toll Reaches 6 in Domalguda LPG Cylinder Blast : తీవ్రగాయాలపాలైన ధనలక్ష్మి, ఆమె ముగ్గురు పిల్లలు.. ఆమె తల్లి పద్మ, చిన్నమ్మ నాగమణి 50 నుంచి 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ధనలక్ష్మి కూతురు శరణ్యశ్రీ మృతి చెందింది. రెండురోజుల వ్యవధిలో ధనలక్ష్మి, ఆమె తల్లి పద్మ, పెద్ద కుమారుడు అభినవ్ కన్నుమూశారు. ఆ తర్వాత వరుసగా నాగమణి, చిన్న కుమారుడు విహాన్ మృతి చెందారు. 30 శాతం కాలిన గాయాలైన ఆనంద్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
LPG Cylinder Blast in Domalguda Hyderabad : అగ్నిప్రమాద ఘటన విషయం తెలియగానే దిగ్భ్రాంతికి గురైన ధనలక్ష్మి భర్త శ్యామ్.. ఆసుపత్రికి పరుగులు తీశాడు. గాంధీలోని ఓ అంతస్తులో పిల్లలు, మరో చోట భార్య, ఇతరులు చికిత్స పొందుతుండగా ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు. ఒకరి మరణ వార్త నుంచి తేరుకునే లోపే మరో విషాదం జరగడంతో శ్యామ్‌ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చిన్నకుమారుడిని బతికించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. విధిరాతను తప్పించ లేకపోయాడు. జూన్ 23న విహాన్ పుట్టిన రోజు ఘనంగా చేశాడు. నెల తిరగకుండానే తన చేతిలో నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి శ్యామ్ గుండెలవిసేలా రోధించాడు.
"నేను బయటకి వెళ్లి వచ్చే దాకా ఎలాంటి సమాచారం రాలేదు. ఎలా అయింది ఏంటి అని అడిగితే.. ముందు నువ్వు గాంధీ ఆసుపత్రికి వెళ్లు అన్నారు. పోలీసుల సహయం చాలా స్పీడ్‌గా జరిగింది. ఆసుపత్రిలో ఉన్నవారి రూపురేఖలు గంటగంటకి మారిపోతున్నాయి. ఫస్ట్ మా పాపని చూసుకున్నాక.. తర్వాత అలా ఉన్న చిన్నారికి గుండు చేపించి చూపించారు. వాళ్ల ముఖం మీద బొబ్బలు వచ్చేశాయి. ఈ ప్రమాదంలో నా పిల్లలు ఘోరంగా కాలిపోయారు. ఏ కుటుంబానికి ఇలా జరగకూడదని కోరుతున్నాను." -శ్యామ్ లాలాజీ, చిన్నారుల తండ్రి
ఘటన జరిగాక ఉపసభాపతి పద్మారావ్‌గౌడ్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెంటనే స్పందించారని.. మెరుగై చికిత్స అందించేలా చొరవచూపారని బాధిత కుటుంబం అంటోంది. ఇండియన్ గ్యాస్ ప్రతినిధులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని శ్యామ్ కుటుంబం ఆరోపిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని శ్యామ్ కుటుంబం వేడుకుంటోంది.
ఇవీ చదవండి: