మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని గ్రామానికి చెందిన బాలస్వామి, ఈశ్వరమ్మ దంపతుల సొంతూరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పోవడంతో హైదరాబాద్ చేరుకున్నారు . కానీ ఇక్కడ కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. ప్రమాదవశాత్తు భార్య తలకు దెబ్బతగలడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. కాళ్లు చేతులు చచ్చు పడిపోయాయి. మాట పడిపోయింది. కష్టపడే సత్తువ లేదు. లాక్‌డౌన్‌తో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం మెహిదీపట్నం సమీపంలోని పోచమ్మ బస్తీలో ఉంటున్న పెద్ద కుమార్తె వీరిని ఆదుకుంటోంది. ఆమెదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితే. ఉన్నంతలో తల్లిదండ్రులను ఆదరిస్తోంది.
భార్య వైద్య ఖర్చులకు ఎవరైనా సహాయ పడతారనే ఆశతో చక్రాల కుర్చీలో పెట్టుకొని వీధుల్లో తిప్పుతున్నాడు. మనసున్న మహరాజులు ఎంతోకొంత సాయం చేస్తుండగా, ఆ డబ్బుతో ఉస్మానియా దవాఖానాకు తీసుకెళ్లి నెలానెలా మందులు తెచ్చుకుంటున్నాడు. మెహిదీపట్నం ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం మండుటెండలో భార్యను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకొని వెళుతుండగా ‘ఈటీవీ భారత్’ ఆరా తీసినప్పుడు తన గతాన్ని తలుచుకొని బాలస్వామి కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇదీ చూడండి: లాక్ డౌన్ ప్రభావంతో పడిపోయిన మామిడి ధరలు