జంట నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నందున జీహెచ్ఎంసీ పాలకవర్గం, అధికారులు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్‌లో వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఉపసభాపతి పద్మారావు అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. కంటైన్మెంట్ జోన్లలో కావాల్సిన ఏర్పాట్ల గురించి పద్మారావు మంత్రితో చర్చించారు.
ఉప్పల్, రామంతాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. మట్టికుప్పల తొలగింపు, మురుగు కాల్వలు, రోడ్లపక్కన శుభ్రం చేసి, ఫాగింగ్ చేశారు. తమ కళ్లుగప్పి అంబులెన్స్‌లో కల్లును తరలిస్తున్న వ్యక్తులను హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. చౌటుప్పల్ నుంచి అమీర్‌పేట్‌కు కల్లును తరలిస్తుండగా.. బల్కంపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో బయటపడిన 40 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. క్షేత్రస్థాయిలో వైరస్ నియంత్రణా చర్యలను పరిశీలించిన ఆయన.. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మన సంప్రదాయ విధానాలతో కరోనాను దరిచేరకుండా చూడొచ్చునని మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో భాస్కర్ చిందు కళాబృందం ఆధ్వర్యంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత నిర్వహించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, వైరస్ వేషధరణలతో గ్రామస్థుల్లో చైతన్యం నింపారు.
జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ కట్టడిలో అధికారుల కృషిని అభినందించిన ఆయన.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. లాక్‌డౌన్ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.
మెదక్ జిల్లాలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్నందున.. ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ మందితో నడిచే ఫ్యాక్టరీల్లో పనులు ప్రారంభించేలా యాజమాన్యానికి ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. వైరస్ బారిన పడిన ఐదుగురు కోలుకున్నారని.. కొత్తకేసులు నమోదు కాకుండా యంత్రాంగం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన నిత్యావసర సరకులను అందజేశారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ ఆంక్షలను పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాలలో పర్యటించిన ఆయన.. లాక్‌డౌన్ అమలుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి స్వస్థలాలకు వెళ్తున్న వలసకూలీలకు మార్గమధ్యలో పోలీసులు ఆహారం అందజేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా తెరుచుకున్న ఓ సిమెంటు దుకాణానికి పురపాలక కమిషనర్ జరిమానా విధించారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు