రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 గంటలపాటు కఠిన లాక్‌డౌన్ అమలుకానుంది. లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. వాహనాలను ఆపి వివరాలు తెలుసుకుంటున్నారు. ఉదయం 6 గం. నుంచి 10 వరకు ఆంక్షలను అధికారులు సడలించారు. సడలింపు సమయంలో నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేశారు. నిత్యావసర వస్తువుల కోసం కొన్ని దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.
ఉదయం 10 గంటలకు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉదయం 10 గంటల్లోపే ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గం. నుంచి రేపు ఉదయం 6 గం.ల వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
మినహాయింపులు వీరికే..
జాతీయ రహదారుల వెంబడి ఉండే పెట్రోల్ బంకులను లౌక్‌డౌన్ నుంచి మినహాయించారు. మిగతా ప్రాంతాల్లో ఉన్న బంకులు మాత్రం... ఉదయం 6గంటల నుంచి పదిగంటల వరకే తెరిచి ఉంచాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. వైద్యం, ఆస్పత్రులు, ఔషధ దుకాణాల, పెట్రోల్ పంపులు, శీతల గిడ్డంగులకు, బ్యాంకింగ్ రంగం, మీడియాకు మినహాయింపు ఉంటుంది.
అత్యవసర సేవలతో పాటు మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది. కొవిడ్ నిబంధనలకు లోబడి తయారీ పరిశ్రమలకు అనుమతినిచ్చారు. టెలికాం, ఇంటర్నెట్, సమాచారం, ఐటీ సేవలకు, కనీసం అవసరమైన ఉద్యోగులతో కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇ-కామర్స్, హోం డెలివరీ సేవలకు, నిర్మాణ పనులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది.
కిక్కిరిసిన మార్కెట్లు
కొనుగోలుదారులతో ఉదయం 6 నుంచే మార్కెట్లు కిటకిటలాడాయి. నిత్యావసర వస్తువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని మార్గదర్శకాల్లో పేర్కొంది. పాలు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తుల సరఫరాకు అనుమతించారు. ఆర్టీసీ కూడా ఉదయం 10 గంటల వరకే బస్సులు నడపనుంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో నేటి నుంచి 10రోజులు లాక్‌డౌన్