రాష్ట్రంలో పెట్రోల్ బంకులపైనా లాక్‌డౌన్ ప్రభావం పడింది. ఆంక్షల అమలులో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉండే బంకులు మాత్రమే పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి సర్కారు అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర వేల బంకులు ఉండగా.... అందులో కేవలం 800 పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. మిగిలినవి లాక్‌డౌన్ కారణంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నడుస్తున్నాయి. ఫలితంగా చమురు విక్రయాలు భారీగా పడిపోయాయని పెట్రోల్ బంకుల డీలర్ల అసోసియేషన్ తెలిపింది. లాక్‌డౌన్ తొలిరోజు 1500కిలో లీటర్ల డీజిల్, 500 కిలో లీటర్ల పెట్రోల్ అమ్ముడవ్వగా.... గురువారం కేవలం వెయ్యి కిలో లీటర్ల డీజిల్, 300 కిలో లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరిగాయని వివరించింది.
కరోనాకు ముందు రోజుకి 9 వేల కిలో లీటర్ల డీజిల్, 3 వేల కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. గతేడాది లాక్‌డౌన్ విధించిన సమయంలో చాలావరకు విక్రయాలు తగ్గి..... తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇంచుమించుగా కొవిడ్‌కు ముందున్న పరిస్థితికి చేరుకున్నాయని అసోసియేషన్ ప్రకటించింది. అయితే.... మళ్లీ పరిస్థితి మెుదటికి వచ్చిందని పేర్కొంది.
కనిష్ట స్థాయికి..
కొవిడ్ ఉద్ధృతితో కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో చమురు విక్రయాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే డిపోలు ఉదయం 8 నుంచి 5 గంటల వరకు పని చేస్తుండటం... ట్యాంకర్లు 10 గంటల తరువాతే వస్తుండటంతో అన్‌లోడ్ చేసుకోవటం ఇబ్బందిగా మారిందని నిర్వహకులు తెలిపారు. సమస్యలు దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు బంకులు నడపటానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పెట్రోల్ పంపుల డీలర్ల అసోసియేషన్ పేర్కొంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.
హైదరాబాద్‌లో ఐటీ సంస్థలున్న హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంకులో రోజుకి వెయ్యి కిలో లీటర్ల విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం ఉద్యోగులు ఇంటినుంచి పనిచేస్తుండగా...వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెట్రోల్ , డీజిల్ అమ్మకాలు 20 శాతం తగ్గాయి.
ఇదీ చదవండి: మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్: డీహెచ్