లాక్డౌన్ పుణ్యమా అని... చదువులన్నీ ఆన్లైన్ అయ్యాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం బాట పట్టారు. ఎంటర్టైన్మెంట్ రెండింతలైంది. వీటన్నింటికీ చరవాణులు, ల్యాప్‌టాప్‌లు దిక్కయ్యాయి. ఈ క్రమంలో చరవాణులు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ... డిమాండ్‌కు తగ్గ సప్లై మాత్రం లేదు.
మొబైల్ ఫోన్ మార్కెట్లో సింహభాగం వాటా చైనా మొబైల్లదే. చరవాణీలకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ సైతం అక్కడి నుంచే ఎక్కువగా సరఫరా అవుతాయి. ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్డౌన్ కారణంగా సరఫరా లేక పూర్తి స్థాయి వ్యాపారం సాగట్లేదని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి.
ఉపాధి కూడా పోయింది...
ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సర్వీసింగ్ చాలా అవసరం. హైదరాబాద్‌లోని కోఠి, జగదీశ్ మార్కెట్, అమీర్‌పేట, సికింద్రాబాద్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వందల్లో సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది స్థానికులే టెక్నీషియన్లుగా ఉపాధి పొందున్నారు. ఈ సెంటర్లలో రోజు కూలీ కోసం రిపేర్లు చేసేవారు సైతం ఉంటారు. లాక్డౌన్ వల్ల వీరిలో చాలా మంది ఉపాధి కోల్పోయారు.
దుకాణాల ముందు క్యూలు...
లాక్డౌన్ సమయంలో చాలా మంది వినియోగదారులు దుకాణాల వద్దకు వచ్చి కాల్ చేసేవారని టెక్నీషియన్లు చెబుతున్నారు. ఇప్పుడు షాపుల వద్ద క్యూ కడుతున్నా.. పూర్తి స్థాయి స్పేర్ పార్ట్స్ దొరక్క వారిని తిప్పి పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ దగ్గర స్పేర్ పార్ట్స్ ఉంటేనే సర్వీస్ చేయగలమని.. తక్కువ లభ్యతతో రిపేర్ ఖర్చులు సైతం పెరిగాయంటున్నారు.
హోం సర్వీస్ దిశగా అడుగులు
లాక్డౌన్ మినహాయింపులతో చరవాణులు, వాటి యాక్ససరీలకు డిమాండ్ విపరీతంగా ఉందని మార్కెట్ వర్గాలంటున్నాయి. తరగతులు ఆన్లైన్ కావటం వల్ల ట్యాబ్‌లకు డిమాండ్ పెరిగినప్పటికీ... స్టాక్ లేదని దుకాణాదారులు వాపోతున్నారు. ప్రస్తుతం రోజువిడిచి రోజు దుకాణాలు తెరుస్తున్నామని... దీని వల్ల పూర్తి స్థాయి వ్యాపారం జరగట్లేదని తెలిపారు. ప్రస్తుతమున్న డిమాండ్ దృష్ట్యా తాము సైతం ఆన్లైన్ వ్యాపారం దిశగా ఆలోచనలు చేస్తున్నామని... మొబైల్ రిపేర్లు సైతం హోం సర్వీస్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.