ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు పోలీసులు అనుమతించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కానూరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక పూజలు జరుగుతుండగా.. విగ్రహాలను తీయించేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్థలంలో పూజలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించినా.. పోలీసులు నిరాకరించటంపై సరికాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఒత్తిడితో విగ్రహాలను అపార్ట్మెంట్కు తరలించి పూజలు నిర్వహించామని అన్నారు. ప్రైవేట్ స్థలాల్లో విగ్రహం ఏర్పాటుకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారని స్థానికులు నిలదీశారు.
భక్తులకు ఏపీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి..
ఈ ఘటనపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు చెబితే వద్దనటానికి పోలీసులు ఎవరని ప్రశ్నించారు. విజయవాడ కానూరులో ప్రైవేట్ స్థలాల్లో భక్తులు ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను తొలగించటం సరికాదన్నారు. ప్రజల మనోభావాలతో ఏపీ సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటుంటే ప్రభుత్వం వేధింపులకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినాయక చవితి ప్రజలు జరుపుకోవడం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు ఇష్టం లేదా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. చిత్త శుద్దితో పరిపాలన చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు. ఇప్పటి వరకు తొలగించిన విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి.. భక్తులకు జగన్ క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.