Loan App Case: హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి లోన్‌యాప్ ద్వారా నగదు తీసుకున్న తర్వాత... కిస్తీలన్నీ చెల్లించాడు. అయినా బకాయిపడిన మొత్తం చెల్లించకపోతే పరువుతీస్తామంటూ.. రుణ్‌యాప్ నిర్వాహకుల నుంచి కొన్ని సందేశాలు వచ్చాయి. కొన్నిరోజులకు స్నేహితులు, కుటుంబసభ్యులకు అసభ్య సందేశాలు పంపడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. రుణం తీసుకున్న మరో యువకుడి ఫొటోను మార్ఫింగ్‌చేసి చరవాణికి పంపారు. బకాయిపడిన మొత్తం చెల్లించకపోతే సామాజికమాధ్యమాల్లో పెడతామని బెదిరించడంతో మరోచోట అప్పతెచ్చి నిర్వాహకులకు వడ్డీతో సహా చెల్లించాడు. ఫతేనగర్‌లో ఓ వ్యాపారి వద్ద పనిచేస్తున్న యువకుడి వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు రూ.60వేల రుణం వెంటనే చెల్లించకపోతే అరెస్టుచేస్తామని బెదిరించారు. అనంతరం అతడి ప్రతిష్ఠను కించపర్చేలా స్నేహితుల చరవాణులకు రుణ యాప్ నిర్వాహకులు అసభ్య సందేశాలు పంపారు. రుణయాప్ ఏజెంట్లే పోలీసుల రూపంలో వచ్చి బెదిరించినట్లు గుర్తించి.. సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాధ్యమైనంత వరకు రుణయాప్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచిస్తున్నారు.
గతేడాది రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆరుగురు చనిపోయారు. ఆ యాప్‌ల వెనక చైనీయులు ఉన్నట్లు గుర్తించి దర్యాప్తు చేసిన సైబర్ క్రైం పోలీసులు... ముగ్గురు చైనీయులతో పాటు వాళ్లకు సహకరించిన వారిలో 20మందికి పైగా అరెస్ట్ చేశారు. నిఘా పెరగ్గా... ఏడాదిపాటు మిన్నకున్న రుణయాప్ నిర్వాహకులు మరోసారి రెచ్చిపోతున్నారు. కొద్దిరోజులుగా జంటనగరాల్లోని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. అవసరానికి డబ్బులు కావాల్సినవారు సరసమైన వడ్డీకి రుణాలిచ్చే బ్యాంకులు లేదా ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రుణయాప్‌ల జోలికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: