కొన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఏదైనా కారణంగా కరెంట్ సరఫరా నిల్చిపోతే ప్రత్యామ్నాయంగా సరిపడా జనరేటర్ల సదుపాయం లేదని విద్యుత్తు ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. మరికొన్నింటిలో ఉన్నా.. వాటి సామర్థ్యం తక్కువగా ఉందని.. నిర్వహణ సమస్యలతో కరెంట్ పోగానే ఆటోమెటిక్‌గా పనిచేసే స్థితిలో లేవని, ఆపరేటర్లు లేరని గుర్తించారు. వీటన్నింటిపైన విద్యుత్తు ఉన్నతాధికారులు ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు లేఖలు రాశారు. సత్వరం ప్రత్యామ్నాయ సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోకపోతే రోగులు ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించారు. తాము నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తామని.. వేసవి, వానాకాలంలో వచ్చే ప్రకృతి విపత్తుల సమయంలోనే చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు.
కింగ్‌కోఠి దవాఖానా..
కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ఇదొకటి. 300 పడకలు ఉన్నాయి. 50 ఐసీయూ కాగా.. మిగతావి ఆక్సిజన్ సౌకర్యమున్నవి. ఇక్కడ ఎప్పుడు 250మందికిపైగానే చికిత్స పొందుతుంటారు. పడకలు పెంచే, ఆసుపత్రి ప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ఇటీవలే ఆసుపత్రి లోడును 295 కేవీఏకి పెంచారు. ప్రస్తుతం ఇక్కడ ఒకటే జనరేటర్ ఉంది. దాని సామర్థ్యం 125 కేవీఏ మాత్రమే. పెంచిన లోడుకు తగ్గట్టుగా అత్యవసరంగా ఇక్కడ మరో జనరేటర్ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్తు అధికారులు సూచించారు.
గాంధీలో ఆపరేటర్ల కొరత..
కొవిడ్ ప్రధాన ఆసుపత్రి ఇది. దాదాపు రెండువేల మంది చికిత్స పొందుతుంటారు. ఇక్కడ 500కేవీఏ మూడు పెద్ద జనరేటర్లు ఉన్నాయి. కరెంట్ పోతే వీటి సామర్థ్యం సరిపోతుంది. కానీ సరఫరా ఆగిపోగానే జనరేటరు ఆన్‌చేసే ఆపరేటర్ల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 24 గంటలపాటు జనరేటర్ల వద్ద ఆపరేటర్లు ఉండేలా చూడాలని చెప్పారు. అంతర్గతంగా ఎక్కడైనా వైరింగ్‌లో సమస్యలు ఎదురై ఎంసీబీల వద్ద ట్రిప్ అయితే గుర్తించే వ్యవస్థ సైతం సక్రమంగా లేదు. గతంలోనూ గంటల తరబడి కరెంట్ సరఫరా నిల్చిపోయి రోగులు ఇబ్బందులు పడిన చరిత్ర ఉంది. కరెంట్ పోగానే అంధకారం నెలకొనకుండా బల్బుల వరకే వెలిగేలా యూపీఎస్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఫీవర్‌లో పరిస్థితిది..
ఐసొలేషన్ కేంద్రంగా ఫీవర్ ఆసుపత్రి సేవలు అందిస్తోంది. ఇక్కడ 200 పడకలపైనే ఉన్నాయి. ఇక్కడ సైతం ఇటీవల విద్యుత్తు లోడును 295 కేవీఏకి పెంచారు. ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనలతో లోడు పెంచాలని అభ్యర్థించడంతో ఆ మేరకు డిస్కం సామర్థ్యాన్ని పెంచింది. ప్రస్తుతం ఇక్కడ 100 కేవీఏ, 125కేవీఏ రెండు జనరేటర్లు ఉన్నాయి. మరోటి అవసరం ఉన్నా.. కరెంట్ పోతే అత్యవసరమైన వాటికి మాత్రమే కరెంట్ వినియోగిస్తే ఇప్పుడున్న రెండు జనరేటర్లు సరిపోతాయి.
ఛాతీ దవాఖానాలో..
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో అదనంగా మరికొన్ని పడకలు పెంచుతున్నారు. విద్యుత్తు లోడును 47 కేవీఏ నుంచి 160కేవీఏకు పెంచారు. ఇక్కడ 125కేవీఏ జనరేటర్ మాత్రమే ఉంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పడకలు ఆసుపత్రిలో దూరంగా మరోచోట ఉండటంతో మరో 125కేవీఏ జనరేటర్ అవసరమని విద్యుత్తు అధికారులు ఆసుపత్రి బాధ్యులకు లేఖ రాశాను. జనరేటర్ ఆపరేటర్ సమస్య ఉన్నట్లు కూడా గుర్తించారు.
ఇదీ చూడండి: బిగ్‌బీకి కరోనా టీకా రెండో డోసు