రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హిమాయత్‌నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట జరిగిన ఆందోళనలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి ఇతర వామపక్షాల నేతలు పాల్గొన్నారు.
రాజ్యాంగానికి లోబడే ఏ ప్రభుత్వమైనా పాలించాలి కానీ.. విరుద్ధంగా ఉండకూడదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆగస్టు 15 ఔన్నత్యాన్ని తగ్గించి రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆగస్టు 5కు ప్రాధాన్యత కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
సంపన్న వర్గాలకు మేలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ సంపదను ప్రధాని మోదీ ప్రైవేటుకు కట్టబెడుతున్నాడని మండిపడ్డారు. సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా మోదీ ప్రకటించిన పథకం ఉందన్నారు. దేశ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ప్రధాని నరేంద్ర మోదే అవుతారని వ్యాఖ్యానించారు. భారత ప్రజానీకం రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు.
మోదీ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను ధ్వంసం చేయడం వల్లే పేద ప్రజలు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. దేశాన్ని రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు భాజపా, ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించాలని అన్నారు.
ఇదీ చూడండి : కేటీఆర్ చొరవతో వాగులో చిక్కుకున్న 12 మంది రైతులను కాపాడిన అధికారులు