CPI and CPM parties held a joint meeting: చాపకింద నీరులా కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని కమ్యూనిస్ట్ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాసమస్యలు, మోదీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడనున్నట్టు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా సీపీఐ, సీపీఎం నేతలు సంయుక్తంగా సమావేశం నిర్వహించటం విశేషం. ఇప్పటి వరకు విడివిడిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఈ రెండు పార్టీలు తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. తెలంగాణలో జరిగిన ఈ సంగమం దేశానికే ఒక సంకేతం కావాలని ఇరు పార్టీల నేతలు ఆంకాంక్షించారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల బలం పెంచుకునేందుకు కలిసి పోటీ చేయనున్నట్టు సంకేతమిచ్చారు.
శాసనసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది: కలిసి పనిచేయడానికి రెండు పార్టీలు ముందుకు రావటం శుభపరిణామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోదీ సర్కారు బీజేపీ ప్రభుత్వంలో లేని రాష్ట్రాల్లో ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మోదీ సర్కారుని గద్దెదించాలన్నారు. శాసనసభలో కమ్యునిస్టుల బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందని పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన తమ్మినేని వీరభద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం చురకలంటించారు. కార్మిక వ్యతిరేక ధోరణిని కేసీఆర్ అవలంభిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఒకే దేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మారాలని మోదీ భావిస్తున్నారు: ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేశారని కమ్యూనిస్ట్ నేతలు విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మారాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేరువేరుగా ఉంటాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.
దేశం కోసం అందరూ ఒకటై ముందుకు సాగాలి: తెలంగాణ సహా తమిళనాడు, కేరళలో గవర్నర్ను ఒక సాధనంగా కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జ్యూడీషియల్, దర్యాప్తు సంస్థలను మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారని నారాయణ మండిపడారు. దేశంలో మోదీ వ్యతిరేక ఫ్రంట్ అవసరం అని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, చాడా వెంకట్ రెడ్డి సహా జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యదర్శులు పాల్గొన్నారు.
"కమ్యూనిజం ప్రమాదకరమైన సిద్ధాంతమని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. కార్చిచ్చు వంటిదని.. దహించి వేస్తుందని విమర్శించారు. అవును కమ్యూనిజం ప్రమాదకరమైన సిద్ధాంతమే. మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు కచ్చితంగా ప్రమాదకరమైందే. దేశంలోని శ్రామికులకు కమ్యూనిజం ప్రియమైన సిద్ధాంతం. మోదీ ఆధారపడుతున్న అదానీ, అంబానీకి మాత్రం కాదు. మేము సవాల్ స్వీకరిస్తున్నాం. మీతో పోరాడుతాం. 2024లో బీజేపీను ఓడించి తీరుతాం."-రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి
ఇవీ చదవండి: