marriages are made in heaven: కాసేపట్లో పెళ్లి.. ఇళ్లంతా సందడి.. బంధువులు, చుట్టుపక్కల వారి హడావుడి.. అందరూ పెళ్లి తంతు కోసం ఎదురుచూస్తున్నారు. ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. అమ్మాయి-అబ్బాయి ఎప్పుడొస్తారా అని అందరూ చూస్తున్నారు. ఓ వైపు నుంచి పెళ్లికొడుకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.. కానీ అంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా ఆ యువకుడు కిందపడ్డాడు. ఏమైందోనన్న టెన్షన్ అందరిలోనూ మొదలైంది. ఏం జరుగుతుందో తెలియక అందరూ ఆందోళన చెందారు. ఆ యువకుడు తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పాడు. అంతే హుటాహుటిన అబ్బాయిని కర్ణాటక శిరుగుప్పలోని ఆస్పత్రికి తరలించారు. కానీ చివరకు విషాద వార్త వినాల్సి వచ్చింది. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జహలి పెళ్లి వేడుకలో జరిగింది.
వివాహ నిశ్చయం ఒక్కరితో.. పెళ్లి మరొకరితో: పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కుమార్తెకు వివాహం ఎలా అవుతుందా అని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కానీ అంతలోనే బంధువులు, గ్రామస్థులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. వేరే యువకుడితో వెంటనే వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఓ వైపు బాధ ఉన్నా.. ఈ నిర్ణయంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఇప్పటికిప్పుడు అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు అని సందేహాలు వెల్లువెత్తాయి. అందరూ చర్చించుకుంటుండగా ఓ అబ్బాయి ప్రస్తావన వచ్చింది. అంతే పెద్దలంతా అబ్బాయి దగ్గరకు వెళ్లారు.
హోలగుండ మండలం వందవాగిలి గ్రామానికి చెందిన ఓ యువకుడిని పెద్దలంతా పెళ్లికి ఒప్పించారు. ముహూర్తం ఆలస్యమైనా వివాహం జరిపించారు. యువకుడి నిర్ణయంతో ఆ అమ్మాయికి కొత్త జీవితం లభించింది. ఆ యువకుడి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ మనసారా అభినందించారు. 'మ్యారేజ్స్ ఆర్ మేడిన్ హెవెన్' అంటే ఇదేనేమో అని అందరూ కొనియాడారు.
ఇవీ చదవండి: it jobs: ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల్లో ఐటీ కొలువుల జోరు