కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి రాగా.. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు పని చేయడానికి అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. అందులో భాగంగా 50 రోజులు తరువాత నిన్న రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ తెరచుకున్నాయి. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.
వెబ్సైట్లో వివరాలు..
దస్తావేజుల రిజిస్ట్రేషన్‌లు, స్టాంపుల అమ్మకం, ఈసీ తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. శానిటైజర్లు, సబ్బులు ఏర్పాటు చేయడంతో పాటు మాస్కులు ధరించి వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు registration.telangana.gov.in అను వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేసుకోవాలి.
పోలీసులు ఆపితే..
స్టాంపు డ్యూటి, ఇతర సుంకాలు కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లించి.. రిజిస్ట్రేషన్ తేదీని ఎంచుకోవాలి. ఆన్‌లైన్ ద్వారానే అనుమతి పత్రం, పాస్ పంపిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోడానికి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఎక్కడైనా పోలీసులు అభ్యంతరం చెబితే.. ఆన్‌లైన్ ద్వారా జారీ చేసిన పాస్ వారికి చూపితే సరిపోతుంది.
రూ. 27 కోట్లు మాత్రమే..
రెవెన్యూ పరంగా చూస్తే.. 2019-20 ఆర్ధిక ఏడాదిలో రూ. 6446 కోట్లు లక్ష్యం కాగా రూ.7060 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం 16.58 లక్షలు డాకిమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెలకి దాదాపు రూ.500 నుంచి 600 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూరుతుంది. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 6,544 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా రూ. 27 కోట్లు రాబడి మాత్రమే వచ్చింది.
ఇవీ చూడండి:బోసి నవ్వుల ఆశ.. ప్రమాదంతో ఆవిరి