హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ ఇంటి అదనపు నిర్మాణం ఉద్రిక్తతలకు దారితీసింది. వైకాపా నేత పీవీపీ, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ... విక్రమ్ కైలాశ్ అనే విల్లా యాజమాని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 నెలలుగా పీవీపీకి చెందిన విల్లాస్‌లో ఇల్లు కొనుగోలు చేసి అందులో ఉంటున్నామని విక్రమ్ కైలాశ్ తెలిపారు. తాము ఇల్లు కొనుగోలు చేసిన సమయంలో ఎలాంటి నిబంధనలు చెప్పకుండా... ఇప్పుడు వచ్చి తమ కొద్దిపాటి అదనపు కట్టడాలను కూల్చి తమ ఇంటిపై దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సుమారు 40 మంది గుండాలతో వచ్చి నిర్మిస్తున్న రూప్‌టాప్‌ను కూలగొట్టారని విక్రమ్ కైలాశ్ ఫిర్యాదులో వివరించారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తమపై జరిగిన దాడి పట్ల న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.