Lal Darwaza Mahankali Bonalu 2023 : పసుపు లోగిళ్లు.... పచ్చని తోరణాలతో... బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తలపించేలా నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం సహా పలు ప్రాంతాల్లో ప్రజలు అమ్మవారికి తెల్లవారుజాము నుంచే బోనాలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. భక్తుల రద్దీతో లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళి మందిరం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
Lal Darwaza Bonalu Hyderabad 2023 : లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి దేవందర్‌గౌడ్ కుటుంబసభ్యులు అమ్మవారికి మహాభిషేకం చేశారు. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు : తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా క్రికెటల్ మిథాలీరాజ్ బోనం ఎత్తుకుని మొక్కులు సమర్పించారు.
బోనాల శోభను సంతరించుకున్న పాతబస్తీ : లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయంతో పాటు ఇతర ఆలయాలు బోనాల శోభను సంతరించుకున్నాయి. పాతబస్తీ హరిబౌలిలోని శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. భాగ్యలక్ష్మి అమ్మవారు, మీరాలం మండీ మహంకాళేశ్వర అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. మీరాలం మండీలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. హైదారాబాద్‌లోని కొత్తపేట్ ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లామైసమ్మ అమ్మవారికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Talasani Comments at Lal Darwaza Bonalu : లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నగరంలో బోనాలు ఎంతో ఉత్సహంగా సాగుతున్నాయని తెలిపారు. బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్న తలసాని.. కులమతాలకు అతీతంగా బోనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకుని ఐక్యతను చూపించాలని తలసాని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Laxman Comments at Lal Darwaza : పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహినీ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. బోనాల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పే పండుగ అని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో కూడా బోనాల పండుగ జరుపుకుంటున్నారన్నారు. రాజకీయలకు అతీతంగా బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో ఉన్న పురాతన దేవాలయాలు సంప్రదాయాలను కొనసాగించాలన్నారు.
2వేల మందితో పటిష్ఠ బందోబస్తు : ఇవాళ బోనాల అనంతరం... రేపు ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో బోనాలు ముగియనున్నాయి. బోనాల సందర్భంగా దక్షిణ మండలం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2వేల మంది పోలీసులను మోహరించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చదవండి :