తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ వేడుకలను పాతబస్తీలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
111 వ వార్షికోత్సవం ప్రత్యేకత
పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాలతో పాటు పలు ఆలయాల్లో రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ఈసారి 111వ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రత్యేకత సంతరించుకోనుంది. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా మహిళలు వీలైనంత త్వరగా అమ్మవారికి బోనం సమర్పించేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. జలమండలి, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగు నీరు అందించనున్నాయి. అమ్మవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నేతలు విజయశాంతి, గీతారెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు సమాచారం.
14 వేల మందితో భద్రత
బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 14 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షించనున్నారు. టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక విభాగం, సీసీఎస్, శాంతిభద్రతలు తదితర విభాగాలకు చెందిన పోలీసులు విధుల్లో పాల్గొంటారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ నెల 29న భవిష్యవాణి రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఉమ్మడి దేవాలయాలతో పాటు వివిధ ఆలయాల నుంచి భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ఏనుగుపై ఛార్మినార్, గుల్జార్‌హౌజ్, మదీనా తదితర ప్రాంతాల మీదగా ఊరేగించి నయాపూల్‌లోని మూసీ నదిలో నిమజ్జన క్రతువుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చూడండి :సరస్వతి పుత్రులకు కేటీఆర్ ఆర్థిక సహాయం