ఫిర్యాదులివ్వడానికి, కేసులు పెట్టడానికి మహిళలు పోలీసుస్టేషన్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్(CM JAGAN) అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. ఈ ఆలోచనపై మరింత అధ్యయనం చేసి మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. ‘దిశ’ కార్యక్రమాల అమలుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీరో ఎఫ్‌ఐఆర్ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలన్నారు. ‘దిశ యాప్‌లోని అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశమై ప్రజా సమస్యలతో పాటు మహిళా భద్రతపైనా సమీక్షించాలి. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. పోలీసుస్టేషన్‌లలో రిసెప్షన్ వ్యవస్థలపైనా సమీక్షించాలి. దిశ యాప్ పనితీరుపై ప్రతి ఠాణాలోనూ డిస్‌ప్లే ఏర్పాటు చేయాలి’’ అని జగన్ ఆదేశించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- మహిళలపై నేరాల విచారణకు 18 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై దృష్టి సారించండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ అంశంపై మరోమారు మాట్లాడండి. బాలలపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక న్యాయస్థానాలపై దృష్టి సారించండి. ఇప్పటికే ఉన్న డిజిగ్నేటెడ్ న్యాయస్థానాల్లో పూర్తి స్థాయి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ఈ వారాంతంలోగా పూర్తి చేయండి. 181 కాల్‌సెంటర్‌ను దిశకు అనుసంధానించండి.
- దిశ కాల్‌సెంటర్‌ను అదనపు సిబ్బందితో బలోపేతం చేయండి. గస్తీ కోసం 145 స్కార్పియో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలుపుతున్నా. విద్యాసంస్థలు, వర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ఇతర ముఖ్యమైన ప్రాంతాలున్న ఠాణాలకు వీటిని ఇస్తాం. కొత్తగా ఆరు దిశ పోలీసుస్టేషన్ల నిర్మాణానికి ఆమోదం ఇస్తున్నాం. వెంటనే నిధులు విడుదల చేయాలి.
- ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో మరో 61 మందిని నియమించండి. తిరుపతి, విశాఖపట్నంల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయండి. గంజాయి రవాణా, సరఫరాలపై ఉక్కుపాదం మోపండి. గంజాయి సేవిస్తూ నేరాలకు పాల్పడుతున్న వారిపై దాడుల్ని విస్తృతం చేయండి. బాధితులను ఆదుకోవడంలో జాప్యానికి తావుండరాదు.
నిజానిజాల్ని ప్రజల ముందుంచాలి..
కొన్ని ఘటనల్ని వక్రీకరించి ప్రభుత్వం, పోలీసు విభాగంపై కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రస్తావించారు. ఎడిట్ చేసిన వీడియోలతో ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎంకు వివరించగా.. ఇలాంటి సందర్భాల్లో నిజానిజాల్ని ప్రజల ముందు పెట్టాలని సీఎం పోలీసు అధికారులకు సూచించారు.
అధికారులు ఏమన్నారంటే..?
దిశ చట్టం ఆమోదం అంశం కేంద్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే రిమైండర్లు కూడా పంపించాం. దిశ యాప్‌లో ఫీచర్స్ మెరుగ్గా ఉన్నాయి. దాన్నే అభయం ప్రాజెక్టుకూ ఉపయోగించొచ్చు. దిశ కంట్రోల్ రూమ్‌లోనే అభయం కూడా భాగం కానుంది. డిసెంబరు నాటికి లక్ష వాహనాల్లో అభయం పరికరాలు అమరుస్తాం.
సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం: సీఎంకు వివరించిన అధికారులు
‘సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నాం. ఆమె తల్లి కోరుకున్న విధంగా కర్నూలు డిస్పెన్సరీలో ఉద్యోగం కొనసాగిస్తాం. ఈ కేసు విచారణ సీబీఐ చేపట్టేలా ప్రభుత్వం తరఫున హైకోర్టులో కౌంటర్ వేస్తాం. బాధితురాలి కుటుంబానికి ఇచ్చేందుకు 5 సెంట్ల ఇంటి పట్టా, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పటికే గుర్తించాం’.
ఇదీ చదవండి: Corona : ఆ రెండు ఒకేసారి వస్తే.. ముప్పు తప్పదు