పట్టభద్రుల ఎన్నికల్లో నిమగ్నమైన ఓ కార్యకర్త కుమార్తె జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఫోన్ చేయడంతో ఆ అమ్మాయి సంతోషంలో మునిగిపోయింది. జన్మదిన కానుక ఏం కావాలని అడగ్గా... తెరాస గెలిస్తే చాలనడంతో.. కేటీఆర్ చలించిపోయారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన తెరాస కార్యకర్త నవాజ్ హుస్సేన్ 20 రోజులుగా హైదరాబాద్‌లో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తన మామ మరణించినప్పటికీ.. అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ప్రచారంలో ఉండిపోయారు. తొమ్మిది నెలల గర్భవతి అయిన తన భార్యకు ధైర్యం చెబుతూ ప్రచారం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ నవాజ్ హుస్సేన్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అదే సమయంలో ఇవాళ తన 12 ఏళ్ల కుమార్తె జన్మదినమని చెప్పారు. నవాజ్ హుస్సేన్ కుమార్తెకు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. కానుక ఏం కావాలని అడిగారు. తెరాస గెలిస్తే చాలన్న అమ్మాయి మాటలకు చలించిన కేటీఆర్.. కరీంనగర్ వచ్చినప్పుడు స్వయంగా కలుస్తానని చెప్పారు. తెరాసతో పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని.. వారికి ఏ ఆపద వచ్చినా తెరాస అండగా ఉంటుందని మంత్రి చెప్పారు.
ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత