KTR Speech at Business Awards Programme : దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు పెరిగిందని ఇది దేశం మొత్తం కంటే ఎక్కువని తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణలో పలు వ్యాపారాలలో రాణిస్తున్న మహిళలకు అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధిలో తెలంగాణకు 19 అవార్డులు వచ్చాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 2014లో రూ.57 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1.83 లక్షల కోట్లుగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలకు మిగిలిన దేశాల్లోని నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. మరోవైపు వ్యవసాయం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం 10 వేల ఎకరాలు ఉందని.. చేపలు, మాంసం, డైరీ ప్రొడక్ట్స్ భారీగా ఎగుమతి చేస్తున్నామన్నారు. దేశానికే కాదు అంతర్జాతీయ వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ హబ్‌గా తయారైందన్నారు. భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల, బయోలాజికల్-ఈ సంస్థ ఎండీ మహిమ దట్ల సమర్థవంతంగా తమ కంపెనీలను నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ రెండు కంపెనీల అతి పెద్ద కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు జరగాలని.. మహిళలు మరింత ముందుకు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: