ప్రతి నీటి బోట్టుని ఒడిసి పట్టుకోవాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై కార్యక్రమాలు చేపట్టాలని... ఈ వేసవిలోనే సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జలమండలి నిర్మించిన థీమ్ పార్కును మంత్రి కేటీర్ సందర్శించారు. అనంతరం పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జలమండలి డైరెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జలమండలి రూపొందించిన థీమ్ పార్కు విద్యార్థులు, నగర వాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేధికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
నీటిని సంరక్షించాలి
ఇక్కడ రూపొందించిన దాదాపు 42 నీటి సంరక్షణ నమూనాలు, పద్ధతులు విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. నీటిని సంరక్షిస్తేనే రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు నీటి ఇక్కట్లు ఉండవని తెలిపారు. అలాగే ఇప్పడు ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై పెద్ద ఎత్తున తగిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజల్లో వర్షాకాలానికి ముందే చైతన్యం తీసుకువచ్చేందుకు ఇది సరైన సమయం అని కేటీఆర్ అన్నారు.
భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలి
స్వయం సమృద్ధి సాధించడానికి... నగర వాసులకు మెరుగైన సేవల కోసం జలమండలి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. అలాగే ప్రధాన నగరంలో మంచినీటి సరఫరా చేసిన జలమండలి... ఓఆర్ఆర్ గ్రామాల్లో కూడాసరఫరా చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం 193 గ్రామాల్లో పనులు చేపట్టిందని వివరించారు. ఈ సందర్భంగా జలమండలి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తయారుచేసిన ప్రత్యేక యూనిఫామ్ జాకెట్ను మంత్రి ఆవిష్కరించారు. నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం వాక్ కు సంబంధించిన క్షేత్రస్థాయి వివరాలు నమోదు చేసుకోవడానికి రూపొందించిన డైరీని కూడా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఇవీ చూడండి: విద్యుత్ వినియోగంలో తెలంగాణ రికార్డు