అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి.. సంస్కరణ ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టంలోని సౌకర్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఆ శాఖ విభాగాధిపతులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్థం అయినప్పుడు అధికారుల్లో పారదర్శకత పెరిగి ప్రజల్లో పురపాలన పట్ల చైతన్యం వస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన పురపాలికల్లో ప్రజలకు నూతన చట్టంపైన మరింత అవగాహన తేవాలని కోరారు.
పురపాలనపై ప్రభుత్వ ఆలోచనలను వివరించేందుకు త్వరలోనే అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మసాబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్‌లు, హెచ్ఎంఆర్ఏల్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ విభాగాల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భావితరాలకు కాలుష్య తెలంగాణ ఇద్దామా: పవన్