మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు. తెరాస అధికారంలోకి రావడానికి లక్షల మంది కార్యకర్తలు కృషి చేశారని వారి కుటుంబాల యోగ క్షేమాలు చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను కేసీఆర్ ఎప్పుడూ కడుపులో పెట్టుకుని చూసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.31.62కోట్ల బీమా చెల్లింపు
మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బీమా చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలను కోల్పోవడం బాధగా ఉందని... అయితే పార్టీ తరఫున కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 1581 మంది కార్యకర్తలకు 31 కోట్ల 62 లక్షల రూపాయల బీమా చెల్లించినట్లు కేటీఆర్ తెలిపారు.
మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులతో భోజనం
దేశంలో ఏ పార్టీకి లేని విధంగా తెరాసకు 60 లక్షల సభ్యత్వం ఉండటం గర్వకారణమన్నారు. వారందరి బీమా కోసం 11.5 కోట్లు చెల్లించామని చెప్పారు. మరణించిన కార్యకర్తలకు పార్టీ నేతలందరూ అండగా ఉండాలని కోరారు. తెలంగాణ బాగుండాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన పార్టీలో కుటంబ సభ్యులుగా ఉండటం సంతోషకరమన్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులతో భోజనం చేసిన కేటీఆర్... వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
ఇదీ చూడండి: ప్రతిపక్ష పాత్రకే ఎన్సీపీ పరిమితం- ఊహాగానాలకు పవార్ తెర