తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)... ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, హుజురాబాద్ ఉపఎన్నికతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం, తదితర అంశాలపై చర్చించనున్నారు.
రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను సమీకరించి వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందిస్తోంది.
గెలుపే లక్ష్యంగా...
హుజూరాబాద్ ఉపఎన్నికపై వ్యూహరచన, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని...విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలు, నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, స్థానికులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శులు, నేతలకు ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కార్యదర్శుల నుంచి కేటీఆర్ సంజాయిషీ కోరనున్నట్లు సమాచారం.. వీటితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్, పార్టీ సభ్యులకు జీవిత బీమా, జిల్లా కార్యాలయాల నిర్మాణం వంటి అంశాలను అజెండాలో పొందుపరిచారు.
ఇదీ చూడండి: Minister KTR: 'అర్హులందరికీ రేషన్ కార్డులు.. పేదల సంక్షేమమే లక్ష్యం'