Minister KTR Letter to Central Govt : రాష్ట్రంలోని పట్టణాలకు నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. గతంలో అనేక సార్లు కేంద్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్న మంత్రి.. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రయత్నానికి తోడ్పాటు అందించేందుకు వచ్చే బడ్జెట్లో అయినా సరిపడా నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని కోరారు. తెలంగాణపై వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అదనంగా ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని ఆరోపించారు.
ప్రభుత్వ పనితీరును మోదీ గుర్తించాలి: కేంద్రం మొండి చేయి చూపినా పురపాలక సంఘాలు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి కనపరుస్తోందన్నారు. ముందుచూపు, దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెచ్చిన పరిపాలనా సంస్కరణలతోనే పట్టణాలన్నీ సమగ్ర అభివృద్ధి చెందాయన్నారు. ఇందుకు కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులతో ఇప్పటికైనా తమ ప్రభుత్వ పనితీరును మోదీ సర్కార్ గుర్తించి, నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో తాను ఈ లేఖ రాస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
47 శాతం రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తున్నందున అన్నిరంగాలల్లో వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసమే నూతన మున్సిపాల్ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం, ప్రతీ పట్టణం కచ్చితంగా ఖర్చు చేయాల్సిన 10శాతం గ్రీన్ బడ్జెట్, టిఎస్ బి -పాస్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 68 పురపాలికలను 142కు పెంచుకున్నామని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
రూ.3050 కోట్లతో మాస్రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం నిర్మాణం: భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.6,250 కోట్లు బడ్జెట్ తో 31కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో రూ.3050 కోట్లు వ్యయంతో 20 కిలోమీటర్ల మేర మాస్రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం నిర్మాణం చేపడుతున్నామని, అందులో 15శాతం మూలధనం పెట్టుబడిగా రూ.450 కోట్లు కేంద్రం కేటాయించాలన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూ. 254 కోట్లు బకాయిలు అయిదు సంవత్సరాలుగా పెండింగ్ ఉందని వాటిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణలోని పురపాలికల్లో రూ.3,777 కోట్లు బడ్జెట్‌తో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ ప్రాజెక్టుల నిమిత్తం 20శాతం అంటే రూ.750 కోట్లు కేంద్రం బడ్జెట్లో కేటాయించాలన్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మెరుగు కోసం రూ.400కోట్లు స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులు కేటాయించాలని, హైదరాబాద్ ప్రభుత్వం చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణంతో మంచి ఫలితాలు, ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ తగ్గిందని ఆయన తెలిపారు. రూ.2400 కోట్లతో చేపట్టే 104 లింక్ రోడ్ల నిర్మాణ బడ్జెట్‌లో మూడో వంతు రూ.800 కోట్ల కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు.
ఈ బడ్జెట్లో రూ.3వేల 450 కోట్లు కేటాయించాలి: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల కోసం రూ.11వేల 500 కోట్లు, ఎస్ఆర్డీపీ రెండవ దశ రూ.14,000 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, స్కై వేల నిర్మాణం కోసం రూ.9,000 కోట్లు మొత్తంగా అయ్యే రూ.34వేల 500 కోట్లల్లో కనీసం పదిశాతం అంటే రూ.3వేల 450 కోట్లు కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరారు. పట్టణాల అభివృద్ధికి ముఖ్యంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను శీఘ్రగతిన అమలు చేయడం కోసం పరిపాలనాపరమైన ఏర్పాట్లను చేసుకున్న విషయాన్ని లేఖలో కేటీఆర్ గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితహారంతో హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీగా అవార్డు లభించిందని కేటీఆర్, మన దేశం నుంచి హైదరాబాద్ నగరానికి మాత్రమే ఆ గుర్తింపు దక్కిన విషయాన్నిలేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వ సంకల్పంతో హైదారాబాద్ అభివృద్ధి చెందడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తోందని కేటీఆర్ వివరించారు.
దేశ గౌరవ, ప్రతిష్టలను విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్నాం: దేశ గౌరవ, ప్రతిష్టలను విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధికి కావాల్సిన వివిధ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని, కనీసం ఈ బడ్జెట్ లోనైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా తెలంగాణ పట్టణాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.