ఈటల రాజేందర్ విషయంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటలది ఆత్మ గౌరవం కాదు.. ఆత్మ వంచన అని హాట్ కామెంట్స్ చేశారు. ఈటల తనతోపాటు.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈటలకు తెరాస ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి కేబినేట్ నిర్ణయాలను తప్పుబట్టారని అన్నారు.
దేని కోసం పాదయాత్ర చేస్తున్నారు..?
ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారని చెప్పారు. ఈటలపై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుందన్నారు. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం అన్యాయం చేశామని పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఈటలపై అనామకుడు లేఖ రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎందుకు మంత్రిగా కొనసాగారని నిలదీశారు. ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా కేసీఆర్ మంత్రిగా ఉంచారని చెప్పారు. ఈటల తెరాసలో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
పోటీ పార్టీల మధ్యే..
ఏ ఎన్నికైనా పార్టీల మధ్యే.. వ్యక్తుల మధ్య కాదని తేల్చిచెప్పారు. హుజూరాబాద్‌లో తెరాస, భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని, తెలంగాణకు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. తెరాస అభివృద్ధిని ఈటల భాజపా ఖాతాలో ఎలా వేసుకుంటారన్నారు. కృష్ణా జలాల వివాదంలో న్యాయం తెలంగాణవైపే ఉందని చెప్పారు. ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం తెలంగాణవైపే ఉంటుందన్నారు. ఈ సీజన్‌లో అందరూ వ్రతాలు చేస్తారు.. షర్మిల ఒక రోజు పెట్టుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: CABINET MEET: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. ఉద్యోగాల భర్తీపై చర్చ