KTR Foreign Tour: భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని.. స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సృష్టించాలన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలు, నగరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా శనివారం బ్రిటన్‌లోని ప్రవాస తెలంగాణ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగించారు.
"తెలంగాణ ఉద్యమానికి ప్రవాసులు ఎంతగానో సహకరించారు. రాష్ట్రం సాధించిన విజయాలలో వారిది గొప్ప పాత్ర. లండన్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా చాలా మంది పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారు. పాలన వ్యవస్థను వికేంద్రీకరించడం, అభివృద్ధిలో సమతూకం పాటించడం తెరాస ప్రభుత్వ విజయాలకు ప్రధాన కారణం. అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, క్వాల్‌కామ్, ఉబర్, సేల్స్‌ఫోర్స్, నోవార్టిస్ తదితర సంస్థలు ఆమెరికా ఆవల తమ అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. మాదాపూర్‌లోనే గాక మారుమూల గ్రామాల్లోనూ పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌తోపాటు పారిశ్రామిక అనుకూల వాతావరణం ఏర్పడింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే కాళేశ్వరాన్ని పూర్తిచేయడం ద్వారా నీటి సమస్య తీరింది. అంకురంగా మొదలైన తెలంగాణ విజయప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణాన్ని ప్రవాసులు మరింత ముందుకు తీసుకెళ్లాలి" -కేటీఆర్
నాలుగురోజులుగా లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొన్న ఆయన శనివారం తెరాస లండన్ ప్రవాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు. బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్‌కు వివరాలు అందిస్తూ అనిల్ కూర్మాచలం కుమార్తె నిత్య రాసిన లేఖకు క్వీన్ నుంచి వచ్చిన ప్రశంస గురించి తెలుసుకున్న మంత్రి నిత్యను అభినందించారు. అనిల్ బృందం సేవలను ప్రశంసించారు.
విద్యుత్ వాహనాల పరిశ్రమ సందర్శన: మంత్రి కేటీఆర్ బాన్‌బరీలోని ప్రసిద్ధ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ అరైవల్ యూకే లిమిటెడ్‌ను సందర్శించారు. ఆర్టీసీ, మెట్రో రైల్వే స్టేషన్లకు అరైవల్ బస్సులు, అంబులెన్సుల కొనుగోళ్లపై కేటీఆర్ చర్చించారు. ఇలాంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలన్నారు.
దావోస్‌కు పయనం: మంత్రి కేటీఆర్ లండన్ పర్యటన ముగిసింది. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరానికి పయనమయ్యారు. దావోస్‌లో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. అనంతరం వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ కోసం తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు.
కార్యాలయ స్థల వినియోగంలో తెలంగాణ అగ్రస్థానం: కార్యాలయ స్థల వినియోగంలో బెంగళూరును అధిగమించి హైదరాబాద్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని.. ఇది తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ శనివారం ట్విటర్‌లో తెలిపారు. తక్కువ అద్దెలు, స్థిరమైన వ్యాపార అవకాశాలు.. హైదరాబాద్‌ను కార్యాలయ స్థల వినియోగ మార్కెట్ చార్టులో అగ్రస్థానాన నిలబెట్టాయని వెల్లడించారు.
"దేశంలోనే భౌగోళిక పరంగా తెలంగాణ 11వ అతి పెద్ద రాష్ట్రం. జనాభా ప్రకారం 12వ అతిపెద్ద రాష్ట్రం... కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ నేడు 4వ అతి పెద్ద సహకారిగా నిలిచింది. మనమందరం విభేదాలు పక్కనపెట్టి భారతదేశం, తెలంగాణ ప్రగతికి పాటుపడదాం" అని మంత్రి కేటీఆర్ తన ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది.. జరిగి తీరుతుంది: సీఎం కేసీఆర్