గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు... సమాచారాన్ని రేపటిలోగా అందించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై.. రెండు రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పిళ్లై నేతృత్వంలోని కేఆర్ఎంబీ ఉపసంఘం (KRMB Subcommittee)హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది.
దశలవారీగా అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని... మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ప్రాజెక్టులు కానందున బనకచర్ల కాంప్లెక్స్, కృష్ణా డెల్టా సిస్టం మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు, కేంద్రాల వివరాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ చెప్పినట్లు తెలిసింది. దీంతో ఏపీకి చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ఆర్డీఎస్కు సంబంధించిన 22 కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
సందిగ్ధత...
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, శ్రీశైలానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల సహా ఏడు కేంద్రాలు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించినట్లు సమాచారం. శ్రీశైలం ఎడమగట్టును కూడా బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ కోరగా... బోర్డు కూడా వివరాలు ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. అయితే తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు లేవని.. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నట్లు సమాచారం. ఏఎమ్మార్పీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా సందిగ్ధత ఉన్నట్లు తెలిసింది.
పులిచింతల తరహాలోనే...
పులిచింతల తరహాలోనే జూరాలను కూడా ఉమ్మడి ప్రాజెక్టుగా పరిగణించాలని... బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరినట్లు తెలిసింది. తెలంగాణ మాత్రం ఈ విషయమై విభేదించినట్లు సమాచారం. మంగళవారం కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం ఉన్నందున రేపటిలోగా అన్ని వివరాలు అందించాలని రెండు రాష్ట్రాల అధికారులకు కేఆర్ఎంబీ సభ్యుడు పిళ్లై చెప్పినట్లు తెలిసింది. బోర్డు నిర్వహణ కోసం సీడ్ మనీ విషయమై కూడా ఉపసంఘం సమావేశంలో చర్చ జరిగింది. నిధుల అంశం ప్రభుత్వాల పరిశీలనలో ఉందని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: లాటరీ టికెట్ కొని మర్చిపోయిన మెకానిక్.. కొద్దిరోజులకు కోటీశ్వరుడై...