KRMB RMC committee meeting news : శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూల్ కర్వ్స్ మార్పులకు సంబంధించి రెండు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం కన్వీనర్ రవికుమార్ పిళ్లై వెల్లడించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రూల్‌కర్వ్స్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్న ఆయన.. మరింత స్పష్టత కోసం కేంద్రజలసంఘం అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ కన్వీనర్ ఆర్‌కె పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, తెలంగాణ జెన్ కో డైరెక్టర్ వెంకటరాజం, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ హాజరయ్యారు.
కేంద్ర జల సంఘం సూచనల ప్రకారం నాగార్జున సాగర్ రూల్‌కర్వ్స్ పై నిర్ణయం జరుగుతుందని రవికుమార్ పిళ్లై వెల్లడించారు. జలవిద్యుత్ చెరిసగం వినియోగానికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. మిగులు జలాల విషయమై సమావేశంలో స్పష్టత వచ్చిందన్న ఆయన ప్రాజెక్టులు పూర్తిగా నిండిన ఓవర్ ప్లో అయ్యాకే వరదను మిగులు జలాల కింద పరిగణించాలని ఇరు రాష్ట్రాలు సూచించాయని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణా నది ప్రవేశించాక సరిహద్దు నుంచి ప్రతినీటి చుక్క లెక్కించాలన్న నిర్ణయానికి రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్లు రవికుమార్ పిళ్లై చెప్పారు. రెండు రాష్ట్రాల అంగీకారంతో నివేదికను ఖరారు చేస్తామన్న ఆయన.. అనతంరం శాశ్వత ప్రాతిపదికన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం మరోమారు కృష్ణాబోర్డు ఆర్ఎంసీ కమిటీ భేటీ కానున్నట్లు చెప్పారు.