కేంద్ర జలశక్తి జారీ చేరిన గెజిట్ నోటిఫికేషన్‌ను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నేటి నుంచి అమలు చేయనున్నాయి (implementation of gazette order on river boards). నోటిఫికేషన్లో చాలా ప్రాజెక్టులు ఉండగా... రెండు రాష్ట్రాలు అంగీకరించిన ప్రాజెక్టులు, ఔట్ లెట్లను మాత్రమే మొదటి దశలో ఆధీనంలోకి తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా కసరత్తు చేశాయి (krmb grmb notification implementation). గోదావరికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టును బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఆయకట్టు తెలంగాణలోని అశ్వరావుపేట మండలం, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా కూనవరం, వేలేరుపాడు మండలాల్లో ఉంది. ఏపీలో 85శాతం, తెలంగాణలో 15 శాతం ఆయకట్టు ఉన్నందున అందుకు అనుగుణంగా నిర్వహణా వ్యయాన్ని భరించాలని నిర్ణయించారు.
కృష్ణా ప్రాజెక్టుల విషయమై రాని స్పష్టత
కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం రెండు రాష్ట్రాల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అంగీకారం లభించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నేరుగా నీరు తీసుకునే అన్ని ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని మంగళవారం నాటి కేఆర్ఎంబీ సమావేశంలో తీర్మానించారు (krmb grmb notification implementation). ఆంధ్రప్రదేశ్ దీనికి మద్దతు తెలపగా... తెలంగాణ మాత్రం బోర్డు నుంచి ప్రతిపాదనలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
అక్కడే వచ్చింది చిక్కంతా..
బోర్డు గుర్తించిన ఔట్ లెట్లు 15 ఉన్నాయి. ఇందులో తెలంగాణలో పరిధిలో 9 ఉండగా... ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఆరు ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం, కల్వకుర్తి పంప్‌హౌస్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, సాగర్ కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్లు, వరదకాలువ, ఏఎమ్మార్పీ పంప్‌హౌస్, రెండు జలవిద్యుత్ కేంద్రాలు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, సాగర్ కుడి కాలువ విద్యుత్ కేంద్రం ఏపీ పరిధిలో ఉన్నాయి. ఈ మేరకు జాబితాలను రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు పంపింది. మంగళవారం నాటి సమావేశం మినట్స్‌ను కూడా రెండు రాష్ట్రాలకు పంపారు. ఈ ఔట్ లెట్లను కేఆర్ఎంబీకి స్వాధీనం చేసేందుకు సమ్మతి తెలుపుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలదే ప్రధాన సమస్యగా మారింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ అంటోండగా... అవి లేకపోతే ఇక ప్రయోజనం ఏమిటని ఏపీ ప్రశ్నిస్తోంది. దీంతో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
అలా కాని పక్షంలో జరిగేదేమిటంటే..
తమ పరిధిలోని అన్ని ఔట్ లెట్లను స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒక రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసి మరో రాష్ట్రం చేయకపోతే గెజిట్ పాక్షికంగానే అమలు కానుంది. దీంతో బోర్డు ఏం చేస్తుందన్నది స్ఫష్టత రావాల్సి ఉంది. స్వాధీనం చేస్తే బోర్డులే అమలు బాధ్యతలను చేపట్టనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వినతులను పరిగణలోకి తీసుకొని నీరు విడుదల చేయాల్సి ఉంటుంది.
అప్పటి వరకు రాష్ట్రాలదే బాధ్యత
రెండు రాష్ట్రాల పరిధిలోని ఆయా ఔట్ లెట్ల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది బోర్డు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. సిబ్బంది, నిధులు, ఆస్తులు ఇంకా బదిలీ కానందున మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే కొనసాగనున్నాయి. అప్పటి వరకు పాలన, నిర్వహణ, నియంత్రణ రాష్ట్రాలే నిర్వహించాల్సి ఉంటుంది. సిబ్బంది జీతభత్యాలు, ఒప్పందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయి. ఈ సమయంలో అవసరమైన ఏర్పాటు చేసుకొని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోనున్నాయి (krmb grmb notification implementation). కేంద్ర పారిశ్రామిక దళం సేవలు అందుబాటులోకి వచ్చే వరకు రాష్ట్రాలే రక్షణ ఏర్పాట్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: KRMB MEETING ON GAZETTE: మొదటి దశలో బోర్డు కిందకు 16 అవుట్లెట్లు..!