Prasanna Kumar Reddy: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం అభినందనలు తెలిపారు. ఇదే సందర్భంలో అదే వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాత్రం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకే వేదికపై మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పరస్పర విరుద్ధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. సంగం మండలం జంగాలకండ్రిక గ్రామంలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలసి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రోడ్‌షోలో తొలుత ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఒక శాసనసభ్యుడు పదవీకాలం మధ్యలో మృతి చెంది ఉప ఎన్నికల్లో ఆ కుటుంబసభ్యులు పోటీ చేస్తే, అక్కడ పోటీ పెట్టకూడదని తెలుగుదేశం ఒక నియమం పెట్టుకుని అమలు చేస్తోందన్నారు. దీనికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి అభినందనలు తెలుపుతున్నట్లు ప్రసన్న పేర్కొన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి చెందినప్పుడు భాజపా నాయకులు సానుభూతి తెలిపి, ప్రస్తుతం పోటీ చేయడం దారుణమన్నారు. ఆ తరువాత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడి గురించి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పిన విషయాన్ని తాను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
తెదేపా ఉప ఎన్నికలో పోటీ పెట్టకపోయినా, ఇక్కడ వైకాపాకి వ్యతిరేకంగా రకరకాల కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. బాబు పెద్ద వెన్నుపోటు దారుడని తీవ్ర ఆరోపణ చేశారు. పేదలను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సంగం మండలంలో 2019లో రెండువేల ఆధిక్యం మాత్రమే వైకాపాకి లభించిందని, ప్రస్తుతం 20 వేలకు పెంచేందుకు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారన్నారు. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి కూడా మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యురాలు ఆర్.లక్ష్మి, సర్పంచి జి.సునీల్, శేఖరయ్య, పి.శంకరరెడ్డి హాజరయ్యారు.
ఇవీ చదవండి: