Koosukuntla Sworn in as MLA : మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కూసుకుంట్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కూసుకుంట్లకు మంత్రులు, స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక తప్పనిసరైంది. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు మునుగోడులో పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నించాయి. ఎట్టకేలకు గులాబీ బాస్ వ్యూహం ఫలించి మునుగోడులో విజయం సాధించింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.