హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 104 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఆర్, కృష్ణయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మందకృష్ణ మాదిగ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. పదవులకోసం కాకుండా ఆశయం కోసం కృషిచేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసారని చాడ వెంకటరెడ్డి గుర్తుచేశారు. బాపూజీ బతికిఉన్నపుడు బాధ పెట్టింది కేసీఆర్ అని.. ఇప్పుడు జయంతి ఉత్సవాల పేరుతో ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆయన జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి ఛైర్మన్ దాసు సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ప్రొఫెసర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ'