కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని అగాథంలోకి నెడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెరాస ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీని చివాట్లు పెట్టి, రైతుల బంద్‌కు మద్దతు తెలిపారని.. ఇప్పుడు అదే నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల పొట్టకొట్టే చట్టాలకు సీఎం మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. తను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని బయపడి కేసీఆర్ మోదీ పక్కన చేరాడని విమర్శించారు.
" కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఐకేపీ కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం దారుణం. రాష్ట్రంలో నూతన చట్టాల అమలును విరమించుకోకుంటే దిల్లీ తరహాలో రైతు ఉద్యమం చేపడుతాం. ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో వేసిన పిటిషన్ జనవరి 9వ తేదీన విచారణకు వస్తుంది. ఈ విషయంపై కోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుంది".
-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
ఇదీ చూడండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్