ఆర్టికల్స్ 370, 35ఏ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వాగతించారు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఇప్పటి వరకు కల్లోల కశ్మీర్ అనే ముద్ర తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. ఏడు దశాబ్దాలుగా కశ్మీర్ ప్రాంతం సమస్యాత్మకంగా ఉందని దేశంలో మిగిలిన రాష్ట్రాలకు లేని స్వయం ప్రతిపత్తి జమ్ముకశ్మీర్‌కు ఉండడం వల్లే... ఆ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి సాధ్యం కాలేదన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు.
కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆర్టికల్ 370 ఎత్తివేతను దేశంలోని చాలా రాజకీయ పార్టీలు విశ్వసించాయని... అది ఇవాళ సాకరమైందని అన్నారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అన్న నినాదంతో కీలకమైన అంశాల్లో యావత్ జాతిని ఏకం చేస్తున్న నాయకుడిగా, ప్రపంచ దేశాలకు భారత్ సత్తాను చాటి చెప్పిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మోదీ వంటి సమర్ధత, దార్శనికత కలిన నేత ప్రధానిగా ఉండడం వల్ల భారత్ ఇక అన్ని రంగాల్లోనూ తిరుగులేని విజయాల్ని సాధిస్తుందన్న నమ్మకం దేశ ప్రజలకు కలుగుతోందన్నారు. మోదీ నాయకత్వంలో భాజపా దేశ వ్యాప్తంగా బలపడినట్లుగా తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
ఇదీ చూడండి :'జమ్ముకశ్మీర్‌పై కేంద్ర నిర్ణయం చారిత్రక మార్పు'