ప్రధాన మంత్రి చర్చల పేరుతో సమయాన్ని వృథా చేయకుండా తక్షణమే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ చట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని.. ధర్నా చేస్తున్న రైతులకు కిసాన్ కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్‌లో సమావేశమైన కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గం రైతులకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా తాము కూడా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా 28 రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేయడం ఎప్పుడూ లేదని వివరించారు.
"భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కొత్తగా తెచ్చిన చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని, రైతులే ధరలు నిర్ణయించుకోవచ్చని చెబుతున్నారు. కాని ఆ విషయాలు చట్టంలో ఎక్కడా లేవు. మద్దతు ధర ఆలానే ఉంటుందని, వ్యవసాయ మార్కెట్‌లు ఎప్పటిలాగానే ఉంటాయని మోదీ పదేపదే చెపుతున్నారు. అన్ని యథాతథంగా ఉన్నప్పుడు కొత్త చట్టాలు ఎందుకో అర్థం కావడం లేదు".
-- కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు
ఇదీ చూడండి: 'రైతులను అయోమయానికి గురిచేయొద్దు:కోదండరామ్'