Kodanda Ram on CM KCR: ఫ్యూడల్ ఆలోచనలు ఉన్న కేసీఆర్‌కు రాజ్యాంగం ఏం అర్థం అవుతుందని తెజస అధ్యక్షుడు కోదండ రాం విమర్శించారు. రాజ్యాంగం రాస్తా అని కేసీఆర్ అంటున్నారంటే అది నిరంకుశ రాజ్యాంగమై ఉంటుందని ఎద్దేవా చేశారు. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగం మార్పు చేస్తా అంటున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని తెజస పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోదండ రాం మీడియా సమావేశం నిర్వహించారు.
తీర్మానాలు చేస్తాం
"రాజ్యాంగం మారాలని కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఆ చర్చ తెస్తే.. కేసీఆర్ తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తోంది. పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగాన్ని మార్చి.. ఏ రాజ్యాంగం తెస్తా అనుకుంటున్నారు. అప్రజాస్వామిక పాలనను ఎదుర్కొనేందుకు త్వరలో తీర్మానాలు చేస్తాం. నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేయటం లేదు.? కూడబలుక్కుని విలాసాలు, విందులకు ఖర్చు చేస్తామంటే చూస్తూ ఊరుకోం." -కోదండ రాం, తెజస అధ్యక్షుడు
317 జీవోను సవరించాలి
అడ్డగోలుగా చేసిన జిల్లా విభజనను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ స్థానికత అంటున్నారని కోదండ రాం విమర్శించారు. స్థానికతకు గుర్తింపు లేకుండా చేసేందుకే 317 జీవో తెచ్చారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన 317జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ బతుకుదెరువు లేక ఎంతోమంది వలసలు పోతున్నారని.. ప్రజలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అందుబాటులో ఉండరని ఆరోపించారు. భూ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించకుండా వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు బడ్జెట్ ఉండాలి కానీ.. కేంద్ర బడ్జెట్ కరోనా తర్వాత ఆర్థిక అసమానతలు పెంచేలా ఉందని కోదండ రాం ఆరోపించారు.
ఇదీ చదవండి: KTR tour in Medchal: 'కేంద్రం ఇచ్చినా... ఇవ్వక పోయినా.. రాష్ట్రంలో సంక్షేమం ఆగదు'