Crops MSP Prices Hike in Telangana : వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ కృత నిశ్చయంతో పని చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సాగు రంగంలో కేంద్రం చేస్తున్న కృషిని వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా వంటి పథకాలను మోదీ తీసుకువచ్చారని తెలిపారు. పంటలకు మద్దతు ధర కూడా గణనీయంగా పెంచామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
11 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాం..: యూపీఏ సర్కారుతో పోలిస్తే ఎంఎస్పీ 5.7 శాతం పెంచినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బియ్యం ఎగుమతుల్లో 109 శాతం ఎక్స్ పోర్ట్కు పెంచామన్నారు. వంట నూనెల ఎగుమతులు తగ్గించామన్నారు. పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉందని పేర్కొన్న కిషన్‌రెడ్డి.. 8 కోట్ల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారన్నారు. భారత్ గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో, మాంసం ఉత్త్పత్తిలో 8వ స్థానంలో ఉందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
'రైతులకు కిసాన్ కార్డులు ఇచ్చాం. ఎంఎస్‌పీకి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 11 కోట్ల రైతులకు కిసాన్ కార్డులు అందించాం. వంట నూనెలకు సంబంధించి ఎగుమతి తగ్గించాం. మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉన్నాం. ఏడాదిలో ఎరువుల రాయితీ 500 శాతం పెరిగింది. ఎరువుల రాయితీని కేంద్రప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. యూపీఏతో పోలిస్తే పంటలకు మద్దతు ధరలు భారీగా పెంచాం.'-కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
రికార్డ్ స్ధాయిలో పప్పు ధాన్యాలను కేంద్రం సేకరిస్తుంది : రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల రాయితీ పెంచినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పంటల బీమా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్న ఆయన.. దేశవ్యాప్తంగా 1260 ఈనం మార్కెట్లను ప్రారంభించామని పేర్కొన్నారు. రికార్డు స్ధాయిలో పప్పు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖరిఫ్ సీజన్ నుంచే పెంచిన ఎంఎస్పీ ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రధానమంత్రితో గొడవ పడి మరీ తెలంగాణలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పించాననన్నారు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
'కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న కార్య్రక్రమాలు చేపడుతుంది. ఎరువులకు.. ఒక్కో యూరియా బస్తాకు కేంద్రం రూ.2,236 సబ్సిడీ అందిస్తోంది. ఒక రైతుకు నేరుగా యూరియా, డీఏపీ సబ్సిడీ కలిపి ఒక ఎకరాకు రూ.18,600 కేంద్రం నుంచి ఎరువుల సబ్సిడీ అందుతుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాం. గతంలో యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోయేది. మా ప్రభుత్వం వచ్చాక అలాంటిది చాలా తగ్గింది.'-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ప్రధాని పర్యటనపై 2 రోజుల్లో క్లారిటీ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రెండు రోజుల్లో స్పష్టత వస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ రోడ్డు షో లేదా బహిరంగ సభ ఉంటోందని ఆయన తెలిపారు. బీజేపీ ముఖ్యనేతలు ఈనెలలో హైదరాబాద్లో పర్యటిస్తున్నారన్నారు. ఈనెల 15న అమిత్ షా.. 25న జేపీ నడ్డాలు తెలంగాణలో పర్యటిస్తారన్నారు. అమిత్ షా, జేపీ నడ్డాల బహిరంగ సభలను విజయవంతం చేస్తామని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: